అచ్యుతాపురం సెజ్‌లోని ఎసెన్షియా అడ్వాన్స్‌డ్ లైఫ్ సైన్సెస్ ప్రమాదంపై థర్డ్ పార్టీ కీలక నివేదికను వెలువరించింది. ఈ ప్రమాదం వెనుక యాజమాన్యం, అధికారుల నిర్లక్ష్యం ఉందని థర్డ్ పార్టీ పేర్కొంది. గత ఏడాది ఇచ్చిన నివేదికలోనే సంస్థలో లోపాలను థర్డ్ పార్టీ నివేదిక ఎత్తి చూపించింది. పైప్ లైన్‌ను తరచూ తనిఖీ చేసే సిస్టమ్ వెంటనే ఫ్యాక్టరీలో ఏర్పాటు చేయాలని థర్డ్ పార్టీ నివేదిక గతంలోనే పేర్కొంది. అయినా సరే.. ఫ్యాక్టరీ యాజమాన్యం పట్టించుకోలేదు. థర్డ్ పార్టీ నివేదికను అమలు చేయాలని కనీసం ఫ్యాక్టరీ యాజమాన్యానికి సైతం ప్రభుత్వ అధికారులు చెప్పలేదని తెలుస్తోంది. పైప్ లైన్ నుంచి బుధవారం మధ్యాహ్నం సాల్వెంట్ లీక్ అయ్యింది. ఫ్యాక్టరీలోని మొత్తం పైప్ లైన్ నుంచి సాల్వెంట్ లీక్ అవడంతో ఒక్కసారిగా మంటలు అలముకున్నాయి.సాల్వెంట్‌కు పెట్రోల్ కంటే వేగంగా మండే శక్తి ఉంది. వేపర్ క్లౌడ్ గాలిలోకి వెళ్లి ఒక స్థాయిని దాటడంతో ఒక్కసారిగా ఎక్సప్లోషన్ జరిగింది. దీంతో ఒక్కసారిగా భారీ శబ్దంతో పేలుళ్లు జరిగాయని అని నిర్ధారణ అయ్యిందని సమాచారం. పైప్ లైన్‌ను తరచూ చెక్ చేసే సిస్టం వెంటనే డెవలప్ చేసుకోవాలని థర్డ్ పార్టీ ఇచ్చిన నివేదికను అమలు చేయని కారణంగానే ఈ ప్రమాదం చోటు చేసుకున్నట్టు తెలుస్తోంది. కనీసం ఆ నివేదికను అమలు చేయాలని కూడా డిప్యూటీ చీఫ్ ఇన్‌స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ చెప్పలేదు. గతంలో ఎల్జీ పాలిమర్స్‌లో కూడా ఇదే నిర్లక్ష్యం తలెత్తింది. అదే అధికారిని తీసుకువచ్చి మళ్ళీ అచ్యుతాపురం సెజ్ ప్రాంతంలో వైసీపీ ప్రభుత్వం నియమించింది. మొత్తానికి ప్రమాదం వెనుక యాజమాన్యం, అధికారుల నిర్లక్ష్యమే ఉందని థర్డ్ పార్టీ నివేదికను బట్టి తెలుస్తోంది.