తిరుపతిలోని ఓ ప్రైవేటు స్కూల్‌లో గురువారం ఉదయం విద్యార్థులకు పెను ప్రమాదం తప్పింది. బైరాగిపట్డెడలోని సోక్రటీసు స్కూల్‌లో అగ్నిప్రమాదం సంభవించింది. అయితే ఆ సమయంలో పిల్లలు ఎలాంటి గాయాలు అవగా సురక్షితంగా బయటపడటంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు. స్కూల్ బిల్డింగ్‌లో పెద్దఎత్తున మంటలు ఎగిసిపడుతున్నాయి. యాజమాన్యం జీ+3 బిల్డింగ్‌లో పాఠశాలను నిర్వహిస్తోంది. ఈ క్రమంలో ఉదయం ఒక్కసారి పాఠశాలల భవనంలో మంటలు వ్యాపించాయి. ప్రమాద సమయంలో పాఠశాలలో మొత్తం 350 మంది విద్యార్థులు ఉన్నారు. అయితే పెంట్ హౌస్ లో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ వలన అగ్నిప్రమాదం సంభవించింది. వేస్టే మెటీరియల్స్‌తో పెంట్ హౌస్‌లో ఉండటంతో మంటల తీవ్రత అధికమైంది. మంటలను గుర్తించిన స్కూల్ యాజమాన్యం వెంటనే తరగతి గదుల్లో నుంచి విద్యార్థులను ఖాళీ చేయించేశారు. దీంతో విద్యార్థులకు తృటిలో ప్రమాదం తప్పినట్లైంది.విషయం తెలిసిన తల్లిదండ్రులు ఎంతో ఆందోళనతో పాఠశాలకు చేరుకున్నారు. అయితే తమ పిల్లలు సురక్షితంగా ఉండంతో వారిని వెంటనే ఇళ్లకు తీసుకెళ్లిపోయారు. మరోవైపు ప్రమాదం విషయం తెలిసిన వెంటనే అగ్నిమాపక సిబ్బంది అక్కడకు చేరుకుని మంటల అదుపునకు యత్నిస్తున్నారు. ఏది ఏమైనా ఇంత పెద్ద ప్రమాదం నుంచి విద్యార్థులు క్షేమంగా బయటపడటంతో స్కూల్ యాజమాన్యంతో పాటు విద్యార్థులు తల్లిదండ్రులు కూడా ఊపిరిపీల్చుకున్నారు.