నూజివీడు ట్రిపుల్ ఐటీ క్యాంపస్ లో సెక్యూరిటీ వైఫల్యం మరో సారి బయటపడింది. ఈసారి ట్రిపుల్ ఐటీ సిబ్బందే బాధితు లుగా మారారు. మంగళవారం రాత్రి నూజివీడు అధ్యాపక సిబ్బంది నివాసం ఉండే ఓ–1 క్వార్టర్స్‌లోని 203, 401 క్వార్టర్స్‌లో దుండగులు తలుపులు పగుల గొట్టి బంగారం, నగదును అప హరించారు. సీఎస్‌ఈ విభాగం లో పనిచేస్తున్న పద్మాభాయ్ అనారోగ్య కారణాలతో నూజివీడు ఆసుపత్రిలో చికిత్స పొందుతుండగా, ఈసీఎస్ విభాగంలోని ప్రియాంక కుటుంబ సభ్యులు ఫంక్షన్ నిమిత్తం శ్రీకాకుళం వెళ్లారు. వీరిరువురు ఇంట్లో లేరని గుర్తించిన దుండగులు తలుపులు బద్దలు కొట్టి పద్మాభాయ్ ఇంట్లో రూ.1.9 లక్షల నగదు, 16 గ్రాముల బంగారం, వెండి సామగ్రి అపహరించినట్టు గుర్తించారు. అయితే ప్రియాంక క్వార్టర్‌లో చోరీ అయిన సొత్తు ఎంత అనేది ఎవరూ అందుబాటులో లేకపోవడంతో తెలియలేదు. ఏలూరు నుంచి వచ్చిన క్లూస్ టీం ఆధారాలను సేకరించగా నూజివీడు పట్టణ ఎస్సై రామకృష్ణ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇటీవల ట్రిపుల్ ఐటీ క్యాంపస్‌లో మద్యం సరఫరా కావడం, అనధికారికంగా ఆర్కే వ్యాలీకి చెందిన విద్యార్థి రెండ్రోజుల పాటు ట్రిపుల్ ఐటీలోనే మకాం వేయడం వంటి సెక్యూరిటీ వైఫల్యాలు మరువక ముందే ఏకంగా సిబ్బంది క్వార్టర్స్‌లోనే దొంగతనాలు జరగడం నూజివీడు ట్రిపుల్ ఐటీలోని సెక్యూరిటీ వైఫల్యం మరోసారి బహిర్గతమైంది.