యజమానుల తప్పిదం కారణంగానే అచ్యుతాపురంలో ఇదంతా జరిగిందన్నట్టుగా డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చెప్పారు. వాస్తవానికి ఇటువంటి పరిశ్రమలు పొల్యూషన్ కంట్రోల్ బోర్డు కింద రావన్నారు. ఇద్దరు యజమానులు హైదరాబాద్‌లో ఉంటారని తన దృష్టికి వచ్చిందని... వారిద్దరి మధ్య గొడవ, బాధ్యత లేని నాయకత్వం అక్కడ ఉందని అర్ధమైందని పేర్కొన్నారు. తాను డిప్యూటీ సీఎంగా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి సేఫ్టీ ఆడిట్ చేయాలని ఆదేశిస్తూనే ఉన్నారన్నారు. అయితే పరిశ్రమల యజమానులు దీనిపై అవగాహన లేక భయపడ్డారన్నారు. పరిశ్రమల్లో రక్షణ చర్యల్లో చాలా లోపాలు ఉన్నాయనేది వాస్తవమని పవన్ కల్యాణ్ పేర్కొన్నారు. అధికారులు కూడా పరిశ్రమల నిర్వాహకులను పిలిపించి మాట్లాడి చర్యలు తీసుకోవాలన్నారు. సెప్టెంబర్ నుంచి పరిశ్రమల్లో రక్షణ చర్యలపై ప్రత్యేక దృష్టి పెడతామని పవన్ కల్యాణ్ తెలిపారు.