కడప జిల్లాలోని ములకలచెరువు మార్కెట్ యార్డుపై పోలీసులు దాడులు నిర్వహించారు. ఈ సందర్భంగా మద్యం బాటిళ్లు స్వాధీనం చేసుకుని ఒకరిని అరెస్టు చేశారు. అలాగే టమోటా మండీ యజమానులు, వ్యాపారులకు నోటీసులు జారీ చేశారు. బుధవారం ఆంధ్రజ్యోతిలో ‘అమ్మో...మార్కెట్ యార్డా’...అసాంఘిక కార్యకలాపాలకు నిలయం అన్న కథనం ప్రచురితమైన విషయం విదితమే. దీనిపై మార్కెట్ కమిటీ అధికారులు, పోలీసులు స్పందించి దాడులు నిర్వహించి నోటీసులు జారీ చేశారు. మార్కెట్ యార్డులో గంజాయి, మద్యం విక్రయించడం, తాగడం, జూదం ఆడటం, మహిళా కూలీలను వేధించడం లాంటి అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని మార్కెట్ కమిటీ కార్యదర్శి జగదీష్ టమోటా మండీల యజమానులు, వ్యాపారస్థులకు నోటీసులు జారీ చేశారు. టమోటా సీజన ప్రారంభమైనందున టమోటా మండీల యజమానులు ఆయా ప్రాంగణాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకుని అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్న వారిని గుర్తించి మార్కెట్ కమిటీ కార్యాలయంలో గానీ పోలీసులకు సమాచారం అందించాలని నోటీసులో పేర్కొన్నారు. ఈ విషయంలో నిర్లక్ష్యం వహిస్తే సంబంధిత మండీ యజమానులు బాధ్యత తీసుకోవాల్సి ఉంటుందని పేర్కొన్నారు. అసాంఘిక చర్యలకు పాల్పడే వ్యక్తులను పనిలో పెట్టుకున్న మండీ యజమానుల లైసెన్సులు రద్దు చేస్తామని హెచ్చరించారు. పోలీసులు దాడులు నిర్వహించి తిరుమల టమోటా మండీ ముందు మ ద్యం విక్రయిస్తున్న నారాయణ (60)ని అరెస్టు చేశారు. అతడి వద్ద నుంచి 36 మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్నట్లు ఎస్‌ఐ గాయత్రి తెలిపారు. కాగా మార్కెట్‌యార్డుపై పోలీసులు నిఘా ఉంచారు. రాత్రివేళల్లో అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్న వారిని గుర్తించే పనిలో పడ్డారు.