మెట్రో పనుల కోసం వినియోగించిన భారీ క్రేన్ అదుపుతప్పింది. పక్కనే ఉన్న భవనంపై అది పడింది. దీంతో ఆ బిల్డింగ్ పాక్షికంగా ధ్వంసమైంది. ఈ సంఘటనలో ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరుగకపోవడంతో అధికారులు ఊరట చెందారు. గుజరాత్‌లోని సూరత్‌లో ఈ సంఘటన జరిగింది. ఆ నగరంలో మెట్రో రైలు మార్గాన్ని నిర్మిస్తున్నారు. గురువారం నానా వరచా ప్రాంతంలో మెట్రో నిర్మాణ పనుల్లో భాగంగా రెండు క్రేన్‌లతో గర్డర్‌లను ఏర్పాటు చేసేందుకు ప్రయత్నించారు. అయితే భారీ క్రేన్ ఒరిగిపోయింది. పక్కనే ఉన్న బిల్డింగ్‌పై అది కూలింది.కాగా, ఈ విషయం తెలుసుకున్న సూరత్ మెట్రో రైల్ డైరెక్టర్, అధికారులు, పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. హైడ్రాలిక్ క్రేన్ కూలిన సంఘటనలో ఎలాంటి ప్రాణ నష్టం జరుగలేదని తెలిపారు. క్రేన్ కూలిన భవనానికి స్వల్పంగా నష్టం వాటిల్లిందని చెప్పారు. ఆ ప్రాంతంలో పార్క్ చేసిన పలు బైకులు కూడా ధ్వంసమయ్యాయని వెల్లడించారు. ఈ సంఘటన నేపథ్యంలో అక్కడి రోడ్డుపై ట్రాఫిక్‌ను మళ్లించారు. మరోవైపు బిల్డింగ్‌పై భారీ క్రేన్ కూలిన వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.