అచ్యుతాపురం సెజ్ ప్రమాద ఘటనపై మాజీ సీఎం వైఎస్ జగన్ చేసిన ఆరోపణలపై ఏపీ మంత్రి కింజారపు అచ్చెన్నాయుడు తీవ్ర విమర్శలు గుప్పించారు. అబద్ధాలే జన్మనక్షత్రం, తప్పుడు ప్రచారాలే లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. ఆయన అబద్ధాలు నమ్మమని ముఖం మీద కొట్టి 11 సీట్లకు పరిమితం చేసినా జగన్ వైఖరిలో ఎటువంటి మార్పు రాలేదని ఆరోపణలు చేశారు.అచ్యుతాపురం సెజ్ ప్రమాద ఘటనలో బాధితులకు తక్షణమే పరిహారం ఇవ్వాలని.. లేదంటే తానే స్వయంగా ధర్నా చేస్తానని జగన్ చేసిన హెచ్చరికపై అచ్చెన్నాయుడు మండిపడ్డారు. ప్రమాదంపై కూటమి ప్రభుత్వం తక్షణమే స్పందించి బాధితులకు అన్ని విధాల అండగా నిలబడిందని తెలిపారు. కూటమి ప్రభుత్వంపై జగన్ రెడ్డి నిస్సిగ్గుగా దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు.ప్రమాదంలో నష్టపోయిన ప్రతి ఒక్కరికీ పరిహారం అందించి అన్ని విధాల ఆదుకునేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంటే ధర్నా చేస్తానని జగన్ రెడ్డి ప్రకటించడం దేనికి సంకేతం అని ప్రశ్నించారు.ఎల్జీ పాలిమర్స్ ప్రమాద సమయంలో జగన్ ప్రకటించిన పరిహారం పూర్తిస్థాయిలో అందలేదని అచ్చెన్నాయుడు గుర్తు చేశారు. ఈ దుర్ఘటన జరిగిన తర్వాత 15 రోజుల వ్యవధిలో చనిపోయిన ముగ్గురికి రూ.లక్షతో పరిహారం సరిపెట్టి విషయం వాస్తవం కాదా? అని ప్రశ్నించారు. ప్రమాదంలో నష్టపోయిన వారిని ఆదుకోవాలని నిరసన తెలిపిన 30 మందిపై గోపాలపట్నం స్టేషన్‌లో కేసు పెట్టింది జగన్ కాదా? అని మండిపడ్డారు.