ఆర్జీ కర్ మెడికల్ కాలేజీలో ట్రైనీ డాక్టర్‌పై అత్యాచారం, హత్య కేసులో తీవ్ర విమర్శలను ఎదుర్కొంటున్న మమతా బెనర్జీ ప్రభుత్వానికి మరో ఎదురుదెబ్బ తగిలింది.బాధితురాలి కుటుంబానికి న్యాయం జరగాలనే డిమాండ్‌కు దుర్గా పూజా కమిటీలు సంఘీభావం తెలిపాయి. ఇందుకు అనుగుణంగా టీఎంసీ ప్రభుత్వం వార్షిక దుర్గా ఫెస్టివల్‌కు కేటాయించిన గ్రాంట్లను తిరస్కరిస్తున్నట్టు ప్రకటించాయి.
ఆగస్టు 9న కోల్‌కతాలో జరిగిన అత్యాచారం, హత్య ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించగా, న్యాయం కోరుతూ రాష్ట్ర వ్యాప్త నిరసనలు కొనసాగుతున్నాయి. ఈ కేసు విషయంలో పశ్చిమబెంగాల్ ప్రభుత్వం, రాష్ట్ర పోలీసులు అనుసరిస్తున్న తీరు పలు ప్రశ్నలకు కూడా తావిచ్చింది. ఈ ప్రభావం ఇప్పుడు ఏటా ఎంతో వైభవంగా నిర్వహించే దుర్గా పూజోత్సవాలపై కూడా పడింది. పలు పూజా కమిటీలు రాష్ట్ర వ్యాప్త నిరసల్లో పాల్గొంటున్నాయి.కాగా, ట్రైనీ వైద్యురాలిపై అత్యాచారం, హత్య ఘటనకు సంఘీభావంగానే తాము టీఎంసీ ప్రకటించిన వార్షిక పూజా గ్రాంటులను నిరాకరించాలని నిర్ణయించినట్టు దుర్గా పూజా కమిటీల నిర్వాహకులు పలువురు తెలిపారు. ఒక్కో పూజా కమిటీకి వార్షికంగా కేటాయించే రూ.70,000 గ్రాంటును ఈసారి రూ.85,000కు పెంచుతున్నట్టు టీఎంసీ ప్రభుత్వం జూలై 23న ప్రకటించింది. అయితే ఆర్జీ కర్ ఘటన అనంతరం బాధితురాలికి న్యాయం జరగాలనే డిమాండ్‌కు అనుగుణంగా ఈ గ్రాంటులను తీసుకోరాదని దుర్గా పూజా కమిటీలు నిర్ణయించాయి. హుగ్లీ జిల్లా ఉత్తరపరలోని ఉత్తరపర శక్తి సంఘ ప్రభుత్వ గ్రాంట్‌ను నిరాకరిస్తున్నట్టు తొలుత ప్రకటించింది. ఏ రాజకీయ పార్టీకి మద్దతుగానో, వ్యతిరేకంగానో తాము ఈ నిర్ణయం తీసుకోలేదని, సామాజిక బాధ్యతగా బాధితురాలికి న్యాయం జరగాలనే కారణంగానే తాము ఈ నిర్ణయం తీసుకున్నామని ఉత్తరపర శక్తి సంఘ కమిటీ కార్యదర్శి ప్రొసేన్‌జిత్ ఘోష్ తెలిపారు. సౌత్ కోల్‌కతాలోని హిగ్లాండ్ పార్క్ ఉత్సవ్ కమిటీ, ఉత్తరపర జైకృష్ణ స్ట్రీట్ అప్నాదర్ దుర్గా పూజా కమిటీ, నదియా జిల్లాలోని బెతువా-దెహరి ట్రౌన్ క్లబ్ కమిటీలు కూడా దుర్గా పూజా గ్రాంట్‌లను నిరాకరిస్తున్నట్టు ప్రకటించాయి.