అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం సెజ్‌లోని ‘ఎసెన్షియా’ కర్మాగారంలో జరిగిన ప్రమాదంలో తీవ్ర గాయాలకు గురై అనకాపల్లి ఉషా ప్రైమ్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను గురువారం శాసనసభ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు, అనకాపల్లి ఎంపీ సీఎం రమేష్ పరామర్శించారు. వారి ఆరోగ్య పరిస్థితిని డాక్టర్ అవినాష్‌ను అడిగి తెలుసుకున్నారు. అన్నివిధాలా ఆదుకుంటామని కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు. పరిశ్రమల్లో మూడు నెలలకు ఒకసారి ఆడిట్ జరగాలని, భవిష్యత్తులో ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా సేఫ్టీ మెథడ్స్‌పై ప్రత్యేక దృష్టి సారించి, నిబంధనలు పక్కాగా అమలు జరిగేలా చర్యలు తీసుకోవాలన్నారు. వారి వెంట మాజీ ఎమ్మెల్యే పీలా గోవింద సత్యనారాయణ తదితరులున్నారు.