గ్రామాల అభివృద్ధిలో ప్రజలను భాగస్వామ్యులను చేస్తున్నామని రాష్ట్ర మైన్స్, ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాలతో ఉపాధి హామీ పథకం పనులపై గ్రామసభలు నిర్వహించనున్నట్టు తెలిపారు. బందరు మండలం భోగిరెడ్డిపల్లి, చిన్నాపురం, తాళ్లపాలెంలో జరిగిన గ్రామసభల్లో మంత్రి కొల్లు రవీంద్ర పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గత ఐదేళ్లలో గ్రామ పంచాయతీలను అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నిర్వీర్యం చేశారన్నారు. గ్రామ స్వరాజ్యం దిశగా కూటమి ప్రభుత్వం అడుగులు వేస్తోందని కొల్లు రవీంద్ర పేర్కొన్నారు. ప్రజలను భాగస్వాములను చేయాలనే ఉద్దేశంతో గ్రామసభలు నిర్వహిస్తున్నామన్నారు. ఉపాధి హామీ పథకం కింద పెద్ద ఎత్తున అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టనున్నామని తెలిపారు.