విభజన చట్టంలో ఇచ్చిన హామీ మేరకు ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక రైల్వే జోన్ కార్యాలయ నిర్మాణానికి అవసరమైన స్థలాన్ని అప్పగించేందుకు ఏపీ ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇటీవల విశాఖపట్నంలో పర్యటించిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.... కీలక ప్రాజెక్టులను సమీక్షించారు. ఈ సందర్భంగా రైల్వే జోన్‌కు సంబంధించిన భూములు అప్పగించాలని కలెక్టర్ హరేంధిర ప్రసాద్‌ను ఆయన ఆదేశించారు. దీంతో జోన్ ఏర్పాటు ప్రక్రియ కొలిక్కి వస్తోంది. నగరంలోని చినగదిలి పరిధి ముడసర్లోవ వద్ద గతంలో రైల్వేకు కేటాయించిన భూములను జీవీఎంసీ, రైల్వే అధికారులు పరిశీలించారు. అక్కడ 52 ఎకరాల భూమి వాస్తవ స్థితిని పరిశీలించి.. ఎటువంటి ఆక్రమణలు లేవని జీవీఎంసీ అధికారులు గుర్తించిన నివేదిక సిద్ధం చేశారు.
దీన్ని త్వరలోనే రైల్వే శాఖకు పంపించి అప్పగింత ప్రక్రియను పూర్తిచేయనున్నారు. ఆ స్థలాన్ని తీసుకోడానికి రైల్వే సముఖంగా ఉన్నప్పటికీ పూర్తిస్థాయిలో వివాదాలను పరిష్కరించి బదిలీ చేయాలని కోరుతోంది. గతంలో ఆ స్థలాన్ని కొందరు ఆక్రమించుకోగా.. అధికారులు వాళ్లను ఖాళీ చేయించారు. అప్పట్లో రైల్వే అధికారులు స్వాధీనం చేసుకోడానికి వెళ్తే.. ఎదురు కేసులు పెట్టారు. వీటన్నింటినీ దృష్టిలో ఉంచుకుని పూర్తి హక్కులతో ప్రహరీ గోడ నిర్మించి స్థలాన్ని అప్పగించాలని రైల్వే అధికారులు అంటున్నారు.
అయితే, భూమి తీసుకోడానికి తొలుత రైల్వే కొంత విముఖత చూపింది. కానీ, ప్రత్యామ్నాయ స్థలాలు నగరానికి దూరంగా ఉండడం, జోన్ కార్యాలయం విశాఖకు దూరంగా ఉంటే బాగోదన్న ఉద్దేశంతో ముడసర్లోవలోనే ఏర్పాటుకు సిద్ధమవుతున్నారు. బదిలీ ప్రక్రియ ముగియగానే.. జోన్ నిర్మాణం జరగనుంది.