ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ప్రభుత్వం మరో శుభవార్త వినిపించింది. పేదల ఆకలి తీరుస్తూ మంచిపేరు తెచ్చుకుంటున్న అన్న క్యాంటీన్లను మరిన్ని ప్రారంభించనుంది. ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా వంద అన్న క్యాంటీన్లు అందుబాటులోకి వచ్చాయి. ఐదు రూపాయలకే భోజనం అందిస్తూ అన్నార్థుల ఆకలి తీరుస్తున్నాయి. ఈ క్రమంలోనే వచ్చే నెలలో మరిన్ని అన్న క్యాంటీన్లు ప్రారంభించాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ విషయాన్ని మున్సిపల్ శాఖ మంత్రి పొంగూరు నారాయణ సోమవారం వెల్లడించారు.
తిరుమల శ్రీవారిని మంత్రి నారాయణ సోమవారం దర్శించుకున్నారు. వీఐపీ విరామ సమయంలో స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం అర్చకులు వేదాశీర్వచనం అందించగా.. అధికారులు తీర్థ ప్రసాదాలు అందజేశారు. శ్రీవారి దర్శనం అనంతరం ఆలయం వెలుపల.. మంత్రి నారాయణ మీడియాతో మాట్లాడారు.
ఈ సందర్భంగా ప్రజలు అష్టైశ్వర్యాలతో, ఆరోగ్యాలతో ఉండాలని శ్రీవారిని కోరుకుంటున్నట్లు మంత్రి చెప్పారు. ఇక సీఎం చంద్రబాబు సూచనలతో రాష్ట్రం ఆర్థిక స్థితిని మెరుగు పరిచే విధంగా మంత్రులంతా కృషి చేస్తున్నామని నారాయణ వివరించారు.అనేక పరిశ్రమలు నెలకొల్పేలా చర్యలు తీసుంటున్నామని.. పరిశ్రమల ద్వారానే నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు లభిస్తాయని అభిప్రాయపడ్డారు. పేదల ఆకలి తీర్చే విధంగా అన్న క్యాంటీన్లు ప్రారంభించామన్న నారాయణ.. ఇప్పటికే 100 అన్న క్యాంటీన్లు అందుబాటులోకి తెచ్చిన విషయాన్ని గుర్తు చేశారు. సెప్టెంబర్ 13వ తేదీ మరో 75 అన్న క్యాంటీన్లు ప్రారంభించనున్నట్లు వెల్లడించారు. అనంతరం తిరుపతి పట్టణాభివృద్ధి సంస్థ కార్యాలయంలో మంత్రి నారాయణ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో మున్సిపల్ కమిషనర్ మౌర్య, తుడా వైస్ ఛైర్మన్ , ఇతర అధికారులు పాల్గొన్నారు.
మరోవైపు ఏపీలో విడతల వారీగా అన్న క్యాంటీన్లను పునః ప్రారంభిస్తున్నారు. ఈ క్రమంలోనే ఇప్పటికే ఆగస్ట్ 15, 16వ తేదీల్లో వంద అన్న క్యాంటీన్లు ప్రారంభించారు. ఆగస్ట్ 15వ తేదీ సీఎం చంద్రబాబు నాయుడు గుడివాడలో అన్న క్యాంటీన్ ప్రారంభించగా.. మరుసటి రోజు రాష్ట్రవ్యాప్తంగా 99 అన్న క్యాంటీన్లను మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజా ప్రతినిధులు ప్రారంభించారు. ఈ అన్న క్యాంటీన్ల ద్వారా ఉదయం 7.30 గంటల నుంచి 10 గంటల వరకు బ్రేక్ ఫాస్ట్.. మధ్యాహ్నం 12.30 గంటల నుంచి 3 గంటల వరకు భోజనం.. అలాగే రాత్రి 7.30 గంటల నుంచి 9 గంటల వరకు డిన్నర్ ఐదు రూపాయల చొప్పున అందిస్తున్నారు. ఆదివారం మినహా వారంలో అన్నిరోజులు అన్న క్యాంటీన్లు అందుబాటులో ఉంటున్నాయి.