వైఎస్ఆర్ జిల్లా రోడ్లు నెత్తురోడాయి. సోమవారం రెండు వేర్వేరు చోట్ల జరిగిన ప్రమాదాల్లో ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు. గువ్వలచెరువు ఘాట్ రోడ్డులో సోమవారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఐదుగురు చనిపోయారు. చింతకొమ్మదిన్నె పరిధిలో.. కంటైనర్, కారు పరస్పరం ఢీకొన్న ఘటనలో ఐదుగురు మృతి చెందారు. కారులో ప్రయాణిస్తున్న నలుగురు వ్యక్తులతో పాటుగా.. కంటైనర్ డ్రైవర్ చనిపోయాడు. అయితే కారులో వెళ్తున్న వారిని చక్రాయపేట మండలం కొన్నేపల్లికి చెందినవారిగా పోలీసులు గుర్తించారు. వీరంతా బంధువుల అంత్యక్రియలకు హాజరై.. తిరిగి వెళ్తున్న సమయంలోనే ఈ ఘోరం జరిగినట్లు తెలిసింది. అటు చనిపోయిన కంటైనర్ డ్రైవర్ వివరాలను తెలుసుకునే పనిలో పోలీసులు ఉన్నారు. మృతదేహాలను పోస్టుమార్టమ్ కోసం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు జరుపుతున్నారు.
మరోవైపు అంత్యక్రియలు వెళ్లి తిరిగి వస్తూ నలుగురు చనిపోవటంతో కొన్నేపల్లిలో విషాదఛాయలు అలుముకున్నాయి. మృతుల బంధువుల ఆక్రందనలతో ప్రభుత్వ ఆసుపత్రి ప్రాంగణం వద్ద ఉద్విగ్న వాతావరణం ఏర్పడింది. అయితే ప్రమాదానికి కారు డ్రైవర్ కారణమా.. లేదా కంటైనర్ నిర్లక్ష్యం కారణమా అనేది తెలియాల్సి ఉంది. మరోవైపు వైఎస్ఆర్ జిల్లాలోనే జరిగిన మరో రోడ్డు ప్రమాదంలో ఇద్దరు చనిపోయారు. దువ్వూరు మండలం చింతగుంటలో కారు బోల్తాపడి ఇద్దరు చనిపోయారు. మరో ఐదుగురికి తీవ్రగాయాలయ్యాయి. బాధితులు అంతా కర్నూలు నుంచి తిరుమల వెళ్తున్నట్లు తెలిసింది. తిరుమల వెళ్తున్న సమయంలో వీరు ప్రయాణిస్తున్న కారు దువ్వూరు మండలం చింతగుంట వద్ద అదుపు తప్పి బోల్తాపడింది.
ఈ ఘటనలో కారులో ఉన్న ఇద్దరు అక్కడికక్కడే చనిపోయారు. మరో ఐదుగురికి గాయాలు కాగా.. స్థానికులు ఆస్పత్రికి తరలించారు. అనంతరం పోలీసులకు సమాచారం అందించారు. దీంతో విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీంచారు. మృతదేహాలను పోస్టుమార్టమ్ కోసం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ప్రమాదంపై బాధితుల బంధువులకు సమాచారం అందజేశారు. అయితే ప్రమాదానికి అతివేగమే కారణమని పోలీసులు ప్రాథమికంగా అంచనా వేశారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.