పరవాడ సినర్జిన్ కంపెనీ బాధితులకు పరిహారం అందజేస్తున్నామని హోంమంత్రి వంగలపూడి అనిత తెలిపారు. సోమవారం మీడియాతో మాట్లాడుతూ.. ప్రమాదంలో చనిపోయిన ముగ్గురు కార్మికులకు ఒక్కక్కరికి కోటి రూపాయలు పరిహారం అందచేస్తామన్నారు. విశాఖ రెండు ప్రమాదాల్లో చనిపోయిన కుటుంబాలను, క్షతగాత్రులను ఆదుకున్నది కూటమి ప్రభుత్వమే అని చెప్పుకొచ్చారు. వైసీపీ నేతలు కార్మికుల కుటుంబాలను అడ్డం పెట్టుకొని రాజకీయం చేస్తున్నారని మండిపడ్డారు. ఘటన జరిగిన కొన్ని గంటల్లోనే సీఎం చంద్రబాబు విశాఖ వచ్చి బాధితులను పరామర్శించి ధైర్యం, భరోసా కల్పించారన్నారు. విశాఖ జిల్లాలో జరిగిన రెండు ఘటనలపై హోం మంత్రిగా తాను ఇక్కడే ఉండి పర్యవేక్షించినట్లు అనిత వెల్లడించారు. కాగా... ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు ఎసెన్షియ ఫార్మా లో ప్రమాద మృతులకు ఎలాగైతే పరిహారం చెల్లించారో.. అలాగే పరవాడ సెనర్జీస్ మృతులకు కూడా పరిహారం చెల్లించాలని యాజమాన్యంతో హోంమంత్రి అనిత మాట్లాడారు. ఈ క్రమంలో పరవాడ సెనర్జీస్ ఫార్మాలో జరిగిన ప్రమాదంలో మృతి చెందిన కుటుంబాలకు కోటి రూపాయల చొప్పున పరిహారం చెల్లించేందుకు అంగీకారం తెలిపారు. అనంతరం ఆసుపత్రిలో చెక్కులను మృతుల కుటుంబాలకు సెనర్జిస్ యాజమాన్యం అందజేసింది.