ఎన్నో శతాబ్దాల నుంచి అణిచివేతలు, ఆంక్షలకు గురైన మహిళలు.. గత కొంత కాలంగా అన్ని రంగాల్లోనూ ప్రవేశిస్తూ రాణిస్తున్నారు. మహిళలను ప్రోత్సహించేందుకు ప్రభుత్వాలు వారికి రిజర్వేషన్లు, సదుపాయాలు కల్పిస్తోంది. మహిళా సాధికారత, చైతన్యం కోసం అన్ని దేశాల్లోనూ ప్రభుత్వాలు ఎన్నో చర్యలు తీసుకుంటున్నాయి. అయితే ఆఫ్గనిస్థాన్‌లో మాత్రం పరిస్థితి ఇందుకు భిన్నంగా ఉంది. షరియా చట్టం పేరుతో మహిళల అణిచివేత నానాటికీ పెరుగుతోంది. 2021లో ఆఫ్గనిస్థాన్‌లో అధికారంలో ఉన్న అష్రఫ్ ఘనీ ప్రభుత్వాన్ని కూలగొట్టిన తాలిబన్లు.. మళ్లీ ఆ దేశాన్ని ఆక్రమించుకుని పాలన సాగిస్తున్నారు. క్రూరమైన పాలనకు పేరు గాంచిన తాలిబన్లు.. ఈసారి అధికారంలోకి వచ్చిన తర్వాత మునుపటిలాగా ఉండమని.. ప్రపంచ దేశాలతో కలిసి వెళ్తామని మొదట్లో ప్రగల్భాలు పలికారు. అయితే ఆ తర్వాతే వారి అసలు స్వరూపం బయటపడింది.
మహిళల కోసం ఆఫ్గనిస్థాన్‌లోని తాలిబన్ ప్రభుత్వం ఆ దేశంలో మరో కొత్త చట్టాన్ని అమల్లోకి తీసుకొచ్చింది. తాలిబన్లు ఆఫ్గనిస్థాన్‌ను చేజిక్కించుకుని ఇటీవలే 3 ఏళ్లు పాలన పూర్తి చేసుకున్నారు. ఈ చట్టం ప్రకారం.. మహిళలు బురఖా ధరించడం, బహిరంగ ప్రదేశాలకు వెళ్లడంపై సరికొత్త ఆంక్షలను విధించారు. ఈ చట్టాలకు తాలిబాన్ అగ్రనేత హిబతుల్లా అఖుంద్‌జాదా ఆమోదం తెలపడం గమనార్హం. మహిళల చెడు ప్రవర్తనను అరికట్టడమే కొత్త నిబంధన అమలు వెనుక కారణం అని తాలిబన్లు చెబుతున్నారు. ఈ కొత్త చట్టాల ప్రకారం.. బహిరంగ ప్రదేశాల్లో మహిళలు తమ ముఖంతో పాటు మొత్తం శరీరాన్ని కప్పుకోవడాన్ని తప్పనిసరి చేశారు.
అంతేకాకుండా వారు వేసుకునే బట్టలపైనా ఆంక్షలు విధించారు. మహిళలు వేసుకునే బట్టలు సన్నగా, బిగుతుగా లేదా పొట్టిగా ఉండకూడదని ఆ చట్టంలో స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. పురుషులను రెచ్చగొట్టకుండా ఉండటానికి ముఖాన్ని కప్పి ఉంచడం అవసరమని పేర్కొన్నారు. కేవలం పెళ్లి చేసుకున్న భర్త, రక్త సంబంధం ఉన్న వారిని మాత్రమే చూడాలని.. మిగితా పురుషులను చూడకూడదని కఠిన ఆదేశాలు ఇచ్చారు. ఇక మహిళలు బహిరంగంగా మాట్లాడటం, పాటలు పాడటాన్ని కూడా నిషేధించారు. పాటలే కాకుండా, కవితలు చదవడం, గట్టిగా మాట్లాడటం కూడా నిషిద్ధం.
2021లో తాలిబాన్ స్వాధీనం చేసుకున్న తర్వాత మహిళలపై కొత్త కొత్త ఆంక్షలు విధించడం ప్రారంభించారు. ఇక అంతర్జాతీయ సమాజం చెబుతున్నట్లు ఆఫ్గనిస్థాన్‌లో మహిళలకు ప్రత్యేక హక్కులు ఏవీ ఉండవని తేల్చి చెప్పారు. ప్రతి ఒక్కరు షరియా చట్టం ప్రకారం నడుచుకోవాల్సిందేనని సుప్రీం నాయకుడు హిబతుల్లా అఖుంద్‌జాదా మహిళలకు తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. ఇక తాలిబన్లు తీసుకొచ్చిన ఈ కొత్త నిబంధనలపై ఐక్యరాజ్యసమితి తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. తాలిబన్లు పెట్టిన ఆంక్షలు ఆఫ్గనిస్థాన్‌లోని మహిళల జీవితాన్ని మరింత కష్టతరం చేసే విధంగా ఉన్నాయని పేర్కొంది. ఈ సమస్యను అంతర్జాతీయ సమాజం తీవ్రంగా పరిగణించాల్సిన అవసరం ఉందని పేర్కొంది. ఎందుకంటే ఇది ఆఫ్గనిస్థాన్‌లో మహిళల హక్కులకు సంబంధించిన అంశం మాత్రమే కాదని.. ఇది మానవ హక్కుల ఉల్లంఘన కూడా అంటూ ఆందోళన వ్యక్తం చేస్తోంది.