పార్టీ తనను పట్టించుకోవడం లేదంటూ మాజీ మంత్రి, వైసీపీ నేత బాలినేని శ్రీనివాసరెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ఎన్నికలు ముగిసినప్పటి నుంచి తాను వైసీపీకి దూరంగా ఉన్నానంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇక ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషీన్లపై తాను చేస్తున్న పోరాటాన్ని వైసీపీ అధిష్టానం పట్టించుకోవడం లేదంటూ బాలినేని శ్రీనివాసరెడ్డి అసంతృప్తి వ్యక్తం చేశారు. ఏదైనా చెబుదామంటే పార్టీలో ఎవరూ వినే పరిస్థితి లేదన్నారు బాలినేని శ్రీనివాసరెడ్డి. ఇక తాను జనసేనలోకి వెళ్తున్నానంటూ కొంతమంది ప్రచారం చేస్తున్నారన్న మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి.. జనసేనలోకి వెళ్లకుండా ఉండేందుకు ఇలా తనపై లేనిపోని ఆరోపణలు చేస్తున్నారేమోనని అనుమానం వ్యక్తం చేశారు. వైసీపీ పట్టించుకున్నా.. లేకపోయినా ప్రజల కోసం తన పోరాటం ఆపనని బాలినేని స్పష్టం చేశారు.
మరోవైపు 2024 ఎన్నికల్లో బాలినేని శ్రీనివాసరెడ్డి ఒంగోలు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి వైసీపీ తరఫున పోటీచేశారు. అయితే టీడీపీ అభ్యర్థి దామచర్ల జనార్ధన్‌రావు.. చేతిలో బాలినేని శ్రీనివాసరెడ్డి 34 వేల ఓట్ల తేడాత ఓడిపోయారు. ఇక ఎన్నికల్లో గ్రాండ్ విక్టరీ కొట్టి టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చింది. ఇక అప్పటి నుంచి బాలినేని శ్రీనివాసరెడ్డి రాజకీయంగా మౌనంగా ఉంటూ వస్తున్నారు. ఇదే సమయంలో ఆయన జనసేనలోకి వెళ్తున్నారంటూ గత కొంతకాలంగా ప్రచారం జరుగుతోంది. అయితే ఇప్పటికే ఓసారి విలేకర్ల సమావేశం నిర్వహించి బాలినేని శ్రీనివాసరెడ్డి దీనిపై క్లారిటీ ఇచ్చారు. తాను ఏ పార్టీలోకి వెళ్లడం లేదని స్పష్టం చేశారు. అలాగే ఒంగోలు వైసీపీ అధ్యక్ష పదవి సైతం స్థానికులకే ఇవ్వాలంటూ అప్పట్లో డిమాండ్ చేశారు.
అయితే తాజాగా వైసీపీ అధిష్టానంపై ఆయన చేసిన వ్యాఖ్యలతో బాలినేని అసంతృప్తిలో ఉన్నారా అనే ఊహాగానాలు మొదలయ్యాయి. ఈవీఎంలపై తాను చేస్తున్న పోరాటానికి వైసీపీ నుంచి సరైన మద్దతు లభించడం లేదనే ఆలోచనలో ఆయన ఉన్నట్లు తెలుస్తోంది. మరోవైపు ఎన్నికల ఫలితాల అనంతరం ఒంగోలులో ఓటింగ్ సరళి, ఈవీఎంలపై అనుమానాలు వ్యక్తం చేస్తూ బాలినేని శ్రీనివాసరెడ్డి ఎన్నికల సంఘాన్ని ఆశ్రయించారు. 12 పోలింగ్ కేంద్రాల్లోని ఈవీఎంలలో మాక్ పోలింగ్ కోసం సుమారుగా ఐదు లక్షల రూపాయలు కూడా ఈసీకి చెల్లించారు.
ఎన్నికల సంఘం ఆదేశాలతో ఇటీవల అధికారులు మాక్ పోలింగ్ కూడా ప్రారంభించారు. నాలుగు రోజుల పాటు మాక్ పోలింగ్ నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నారు. మాక్ పోలింగ్ కోసం అధికారులు ఈవీఎంలను కూడా తెరిచారు. అయితే మాక్ పోలింగ్ కాదని వీవీప్యాట్ స్లిప్పులను లెక్కించాలని బాలినేని పట్టుబట్టగా అధికారులు తిరస్కరించారు. దీంతో బాలినేని మాక్ పోలింగ్ బహిష్కరించారు. అయితే ఈ వ్యవహారంలో వైసీపీ నుంచి తనకు మద్దతు లభించలేదని బాలినేని శ్రీనివాసరెడ్డి భావిస్తున్నట్లు సమాచారం. ఈ అసంతృప్తితోనే ఆయన ఈ వ్యాఖ్యలు చేసినట్లు తెలిసింది.