దేశంలో మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలు ఆందోళనలు రెకేత్తిస్తున్నాయి. కోల్‌కతా ఘటన మరువకముందే మరిన్ని ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. తాజాగా మహారాష్ట్రలోని రత్నగిరి జిల్లాలో 20 ఏళ్ల నర్సింగ్ విద్యార్థినిపై ఆటో డ్రైవర్ అత్యాచారానికి పాల్పడ్డాడు. సోమవారం విధులు పూర్తి చేసుకొని యువతి ఇంటికి వెళ్తుండగా ఈ ఘటన జరిగినట్లు పోలీసులు తెలిపారు. రత్నగిరిలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో పనిచేస్తున్న నర్సింగ్ విద్యార్థిని ఆటోలో ఇంటికి బయల్దేరింది. మార్గమధ్యలో డ్రైవర్‌ను నీళ్లు అడగ్గా.. అతను తాగే నీటిలో మత్తుమందు కలిపి ఇచ్చాడు.
దీంతో యువతి స్పృహ కోల్పోయి పడిపోయింది. అక్కడి నుంచి ఆమెను ఎవరూ లేని ప్రదేశానికి తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డాడు. చంపక్ గ్రౌండ్ సమీపంలో తీవ్ర గాయాలతో బాధితురాలు అపస్మారక స్థితిలో కనిపించినట్లు పోలీసులు తెలిపారు. ప్రస్తుతం ఆమెను చికిత్స కోసం ఆసుపత్రిలో చేర్చారు. యువతికి అనేక గాయాలైనట్లు వైద్యులు తెలపారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు పరారీలో ఉన్న నిందితుడి కోసం గాలిస్తున్నారు. ఈ ఘటన రత్నగిరిలో కలకలం రేపింది. నిందితుడిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ నర్సులు, ఆస్పత్రి సిబ్బంది నిరసనకు దిగారు.