ఆంధ్రప్రదేశ్‌లో అధికారంలో ఉన్న నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం.. కేంద్రం నుంచి రావాల్సిన నిధులు, ప్రాజెక్టులను సాధించుకుంటోంది. కేంద్రంలో అధికారంలో ఉన్న ఎన్డీఏ కూటమిలో కీలక పార్టీగా ఉన్న టీడీపీ.. ఏపీకి కావాల్సిన వాటిని తెచ్చుకోవడంలో విజయం సాధిస్తోంది. ఈ నేపథ్యంలోనే పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి త్వరలోనే రూ.12 వేల కోట్లు కేటాయించేందుకు సిద్ధం కాగా.. తాజాగా ఏపీలో 2 ఇండస్ట్రీయల్ స్మార్ట్ సిటీలను ఏర్పాటు చేసేందుకు నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన భేటీ అయిన కేంద్ర కేబినెట్.. ఈ నిర్ణయానికి ఆమోదముద్ర వేసింది. దేశంలో మొత్తం 12 ఇండస్ట్రీయల్ స్మార్ట్ సిటీలను ఏర్పాటు చేయనుండగా.. ఏపీకి 2 కేటాయించింది. అదే సమయలో తెలంగాణకు కూడా ఒక ఇండస్ట్రీయల్ స్మార్ట్ సిటీని ప్రకటించింది.
ఇదే సమయంలో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి కేంద్రంలోని నరేంద్ర మోదీ సర్కార్ కట్టుబడి ఉందని కేంద్రమంత్రి కింజరపు రామ్మోహన్‌నాయుడు స్పష్టం చేశారు. బుధవారం ఢిల్లీలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో రామ్మోహన్ నాయుడు మాట్లాడారు. ఓర్వకల్లు, కొప్పర్తికి ఇండస్ట్రియల్ స్మార్ట్ సిటీలను కేంద్రం మంజూరు చేసినట్టు కేంద్రమంత్రి చెప్పారు. అదే సమయంలో హైదరాబాద్- బెంగళూరు.. విశాఖ- చెన్నై కారిడార్లను కేంద్రం అభివృద్ధి చేస్తుందని తెలిపారు.
కడప జిల్లాలోని కొప్పర్తిలో పారిశ్రామిక హబ్ కింద 2596 ఎకరాలను కేంద్ర ప్రభుత్వం.. ఇండస్ట్రీయల్ స్మార్ట్ సిటీగా అభివృద్ధి చేయనున్నట్టు కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు వెల్లడించారు. ఈ కొప్పర్తి.. విశాఖ-చెన్నై కారిడార్ కిందకు వస్తుందని.. దీని కోసం నరేంద్ర మోదీ సర్కార్ రూ.2,137 కోట్లను ఖర్చు చేయనున్నట్లు వివరించారు. అదే సమయంలో ఈ కొప్పర్తి పారిశ్రామిక హబ్‌తో 54,500 మందికి ఉపాధి లభిస్తుందని తెలిపారు. ఇక ఈ కొప్పర్తిలో ఉత్పత్తి రంగంపై ఎక్కువగా దృష్టి పెట్టినట్టు కేంద్రమంత్రి వెల్లడించారు.
మరోవైపు.. కర్నూలు జిల్లా ఓర్వకల్లులో 2,621 ఎకరాల్లో పారిశ్రామిక కారిడార్‌ను ఏర్పాటు చేయనున్నట్టు రామ్మోహన్ నాయుడు వెల్లడించారు. ఇందుకోసం రూ.2,786 కోట్లను కేంద్ర ప్రభుత్వం వెచ్చించనున్నట్టు పేర్కొన్నారు. ఈ పారిశ్రామిక హబ్ ద్వారా దాదాపు 45 వేల మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయని వెల్లడించారు. ఈ రెండు ఇండస్ట్రీయల్ స్మార్టీ సిటీలతో రాయలసీమకు లబ్ధి చేకూరుతుందని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. ఏపీలోని ఈ రెండు స్మార్ట్ సిటీలకు సంబంధించి కేంద్ర కేబినెట్ తాజాగా ఆమోదం తెలిపిందని చెప్పారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోసం కేంద్రం, రాష్ట్రం కలిసికట్టుగా ముందుకెళ్తున్నాయని చెప్పారు. ఏపీ విషయంలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారని వెల్లడించారు.
పోలవరం ప్రాజెక్టుకు రూ.12 వేల కోట్లు ఇచ్చేందుకు త్వరలో కేంద్రం అంగీకారం తెలపనుందని కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు వెల్లడించారు. నవంబరులో పోలవరం పనులు మళ్లీ ప్రారంభించేలోగా ఈ రూ.12 వేల కోట్ల నిధులు విడుదలవుతాయని తెలిపారు. గత 5 ఏళ్లలో అనేక రంగాల్లో ఏపీ వెనుకబడిందని.. ప్రస్తుతం డబుల్ ఇంజిన్ గ్రోత్ ఎలా ఉందో చూస్తున్నామని రామ్మోహన్ నాయుడు చెప్పారు.