అధికారం కోల్పోయిన తర్వాత ఏపీలో వైసీపీకి షాక్‌ల మీద షాక్‌లు తగులుతున్నాయి. సీనియర్ నేతల దగ్గర నుంచి జూనియర్ల వరకు అంతా పార్టీకి రాజీనామాలు చేస్తున్నారు. కీలక నేతలు అంతా పార్టీకి, పదవులకు గుడ్ బై చెప్పి.. అధికార తెలుగుదేశం పార్టీలో చేరుతున్నారు. ఈ క్రమంలోనే తాజాగా ఎంపీ మోపిదేవి వెంకటరమణ వైసీపీకి రాజీనామా చేసి త్వరలోనే టీడీపీలో చేరనున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో తాజాగా మరో నాయకురాలు పార్టీకి గుడ్ బై చెప్పారు. ఎమ్మెల్సీ పోతుల సునీత.. వైసీపీకి, తన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశారు. అయితే మోపిదేవి వెంకటరమణ పార్టీ మారుతున్నారనే వార్తలు చక్కర్లు కొడుతున్న వేళ.. పోతుల సునీత రాజీనామా చేయడం ప్రస్తుతం తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
ఎమ్మెల్సీ పదవికి.. పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు వైసీపీ అధినేత వైఎస్ జగన్‌కు ఎమ్మెల్సీ సునీత లేఖ పంపినట్లు తెలుస్తోంది. అయితే తాను ఇప్పటికీ రాజీనామా మాత్రమే చేస్తున్నట్లు ఎమ్మెల్సీ సునీత తెలిపారు. ఇంకా ఏ పార్టీలో చేరాలి అనే దానిపై భవిష్యత్ కార్యాచరణను త్వరలోనే వెల్లడించనున్నట్లు చెప్పారు. గతంలో టీడీపీలో పోతుల సునీతా పనిచేశారు. ఆమె ఎమ్మెల్యేగా ఓడిపోవడంతో తెలుగుదేశం పార్టీ తరఫున ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. ఆ తర్వాత 2019 ఎన్నికల్లో టీడీపీ ఘోర పరాజయంతో.. ఆమె వైసీపీ కండువా కప్పుకున్నారు. ఇప్పుడు వైసీపీ ఓటమి పాలు కావడంతో పార్టీకి, పదవికి గుడ్ బై చెప్పారు.
2014 ఎన్నికల్లో చీరాల నియోజకవర్గం నుంచి తెలుగుదేశం పార్టీ తరఫున పోటీ చేసిన పోతుల సునీత.. ఇండిపెంటెండెంట్ అభ్యర్థి ఆమంచి కృష్ణమోహన్‌పై పరాజయం పాలయ్యారు. అయితే ఆ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావడంతో పోతుల సునీతకు ఎమ్మెల్సీ పదవిని కట్టబెట్టారు. ఇక 2019 ఎన్నికల్లో చీరాల నియోజకవర్గం నుంచి టీడీపీ తరపున కరణం బలరాం పోటీ చేసి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. అయితే ఆ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అధికారం కోల్పోయి వైసీపీ అధికారంలోకి రావడంతో చీరాల ఎమ్మెల్యే కరణం బలరాంతో పాటు ఎమ్మెల్సీ పోతుల సునీత కూడా టీడీపీకి రాజీనామా చేసి వైసీపీలో చేరారు. దీంతో జగన్ మోహన్ రెడ్డి.. కూడా పోతుల సునీతకు మళ్లీ ఎమ్మెల్సీ పదవిని ఇచ్చి గౌరవించారు. ఇక 2024 ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఘోర ఓటమిపాలవడంతో పోతుల సునీత క్రమంగా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. తాజాగా వైసీపీకి, ఎమ్మెల్సీ పదవికి ఆమె రాజీనామా చేశారు.