ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి డబుల్ బొనాంజా. రాష్ట్రానికి భారీగా నిధులు కేటాయించింది కేంద్ర ప్రభుత్వం. పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి రూ. 12 వేల కోట్లకు ఆమోదం తెలుపడంతో పాటు.. రాష్ట్రంలో 2 ఇండిస్ట్రియల్ స్మార్ట్ సిటీస్ ఏర్పాటు చేసేందుకు కేంద్ర మంత్రివర్గం సిద్ధమైంది. బుధవారం కేంద్ర మంత్రివర్గం సమావేశమైంది. ఈ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు మీడియాకు వెల్లడించారు. పోలవరం ప్రాజెక్టుకు రూ. 12 వేల కోట్లకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపిందని రామ్మోహన్ నాయుడు తెలిపారు. అలాగే పోలవరం ప్రాజెక్టును గతంలో నిర్మించిన నిర్మాణ సంస్థలకే పనులు అప్పగించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందన్నారు. జగన్ నిర్ణయాలతో పోలవరం ప్రాజెక్టు నిర్మాణం వెనక్కి వెళ్లిందని విమర్శించారు. చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యాక పోలవరంపై దృష్టి పెట్టారన్నారు. ఆయన నాయకత్వంలో ఇవన్నీ సాధ్యమవుతున్నాయని చెప్పారు. ఏపీకి నిధులు కేటాయించినందుకు కేంద్ర ప్రభుత్వానికి, ప్రధాని మోదీ, కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌కు ఈ సందర్భంగా రామ్మోహన్ నాయుడు ధన్యవాదాలు తెలిపారు.