పోలవరం ప్రాజెక్టుకు రూ.12 వేల కోట్ల నిధులు, రాష్ట్రంలో 2 ఇండస్ట్రీయల్ స్మార్ట్ సిటీలు ఏర్పాటుకు ఆమోదం తెలిపేందుకు కేంద్ర కేబినెట్ సిద్ధంగా ఉన్న విషయం తెలిసిందే. దీంతో ప్రధాని నరేంద్ర మోదీ సారధ్యంలోని కేంద్ర ప్రభుత్వానికి ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు కృతజ్ఞతలు తెలిపారు. ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర మంత్రులు నిర్మలా సీతారామన్, సీఆర్ పాటిల్‌కు ధన్యవాదాలు తెలిపారు. ఏపీకి సంబంధించిన రెండు అంశాలను కేంద్రం క్లియర్ చేసిందని, కేంద్రం చర్యలతో రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని ఆశ కలుగుతోందని చంద్రబాబు హర్షం వ్యక్తం చేశారు. కేంద్ర కేబినెట్ నిర్ణయాలు ఒక నమ్మకం, భరోసా ఇస్తున్నాయని అన్నారు. పోలవరం ప్రాజెక్టుకు రూ.12,127 కోట్లు ఇవ్వడానికి కేంద్రం అంగీకరించిందని పేర్కొన్నారు. పోలవరం ప్రాజెక్టును 2027 మార్చి లోగా పూర్తి చేసేందుకు షెడ్యూల్ చేశామని వెల్లడించారు. గత ప్రభుత్వం కారణంగా పోలవరం ప్రాజెక్ట్‌కు చాలా ఇబ్బందులు వచ్చాయని ఆయన విచారం వ్యక్తం చేశారు.