పోలవరం ప్రాజెక్టు తొలి దశకు రూ.12,127 కోట్లు ఇచ్చేందుకు మోదీ ప్రభుత్వం అంగీకరించిందని ముఖ్యమంత్రి చంద్రబాబు వెల్లడించారు. ఇక కొత్త డయాఫ్రం వాల్ నిర్మాణం సహా మిగిలిన హెడ్‌వర్క్స్ పనులు 2027 మార్చినాటికి పూర్తవుతాయని ప్రకటించారు. ఇందుకుగాను ప్రధానికి, కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌కు ధన్యవాదాలు తెలిపారు. పోలవరం తొలిదశ పనులకు నిధులు మంజూరు చేస్తూ కేంద్ర కేబినెట్ నిర్ణయం తీసుకున్నందున హెడ్‌వర్క్స్ పనుల కార్యాచరణను సిద్ధం చేస్తున్నామని చెప్పారు. బుధవారం రాష్ట్ర మంత్రివర్గ సమావేశం జరుగుతున్న సమయంలోనే కేంద్ర కేబినెట్ నిర్ణయాల గురించి తెలిసింది. దీంతో మంత్రివర్గ సమావేశం ముగిసిన వెంటనే చంద్రబాబు విలేకరుల సమావేశం నిర్వహించారు. పోలవరం ప్రాజెక్టుకు, పారిశ్రామిక కారిడార్లకు ఆర్థికంగా కేంద్రం సహకరిస్తోందని.. ఇందుకు ప్రధానికి ధన్యవాదాలు తెలుపుతున్నామని చెప్పారు. రాష్ట్రంతో పాటు పోలవరం ప్రాజెక్టుకు కూడా 2019లో సీఎం రూపంలో జగన్మోహన్‌రెడ్డి అనే శనిగ్రహం ఆవహించిందని చంద్రబాబు విరుచుకుపడ్డారు. ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే.. రివర్స్ టెండర్ పేరిట పోలవరం కాంట్రాక్టు సంస్థను మార్చేశారని మండిపడ్డారు. 2019 నుంచి 2021 నవంబరు దాకా పనులే చేయలేదని.. ఫలితంగా 2020లో వచ్చిన వరదకు డయాఫ్రం వాల్ దెబ్బతిందని ఆగ్రహం వ్యక్తంచేశారు. కేంద్ర జలశక్తి శాఖ, కేంద్ర జల సంఘం ఐఐటీ-హైదరాబాద్‌తో అధ్యయనం చేయిస్తే.. జగన్ ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా 2020 వరదలకు ఈ వాల్ దెబ్బతిన్నట్లు తేలిందన్నారు. గైడ్ బండ్ కుంగిపోయిందని.. ఎగువ, దిగువ కాఫర్ డ్యాంలకు సీపేజీ వచ్చిందని గుర్తుచేశారు. టీడీపీ అధికారంలో ఉండగా 72 శాతం పనులు పూర్తి చేశామని.. 48 రేడియల్ గేట్లు బిగించేందుకు వీలుగా సిద్ధం చేశామని అన్నారు. ప్రతి సోమవారం పోలవరం ప్రాజెక్టుపై సమీక్షించానని.. దీనిని పూర్తి చేయడం తన అభిలాషగా పేర్కొన్నారు. కేంద్రం నిధులు ఇస్తున్నందున కొత్త డయాఫ్రం వాల్ నిర్మాణం చేపడతామన్నారు. ఇది పూర్తి చేస్తూనే ఎర్త్ కమ్ రాక్‌ఫిల్ (ఈసీఆర్‌ఎఫ్) డ్యాంను కూడా నిర్మిస్తామని.. 2027 మార్చిలోగా తొలిదశ పనులు పూర్తి చేస్తామని వివరించారు.