అమెరికాలో ఇచ్ఛాపురం పట్టణానికి చెందిన పి.రూపక్‌రెడ్డి (26) మృతి చెందాడు. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. రూపక్ రెడ్డి ఎమ్మెస్ సాఫ్ట్‌వేర్ చేయడానికి 10 నెలల కిందట అమెరికా వెళ్లాడు. హరీష్ బర్గ్ యూనివర్సిటీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీలో ఎమ్మెస్ చేస్తున్నాడు. మంగళవారం సాయంత్రం తన స్నేహితులు ఐదుగురితో కలసి రూపక్ ఓ సరస్సులో బోటింగ్‌కు వెళ్లాడు. సరస్సు మధ్యలో ఉన్న రాయిపైకి ఎక్కి ఫొటోలు తీసుకుంటుండగా రూపక్ రెడ్డితో పాటు స్నేహితుడు రాజీవ్ సరస్సులోకి జారిపోయారు. మిగతా స్నేహితులు రాజీవ్‌ను కాపాడినా, రూపక్‌ను మాత్రం రక్షించలేకపోయారు. దీనిపై అక్కడి పోలీసులకు ఫోన్‌లో సమాచారం ఇచ్చారు. దీంతో రిస్క్యూటీం సభ్యులు వచ్చి గాలించగా రూపక్ రెడ్డి మృతదేహం లభించింది. కాగా రూపక్‌రెడ్డి తండ్రి కవిరాజ్‌రెడ్డి ఇచ్ఛాపురం మండలం మండపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఒడియా స్కూల్ అసిస్టెంట్‌గా విధులు నిర్వహిస్తున్నాడు. తల్లి ధనవతి సంగీత కళాకారిణి. రూపక్ ఇచ్ఛాపురంలోని ఒక ప్రైవేటు పాఠశాలలో పదో తరగతి వరకు చదివాడు. ఇంటర్ విశాఖపట్నంలోని ప్రైవేటు కళాశాలలో, బీటెక్ రాజాం జీంఆర్ కళాశాలలో పూర్తిచేశారు. ఆ కాలేజీలో సంజీవ్ అనే విద్యార్థితో స్నేహం ఏర్పడింది. వీరిద్దరూ బెస్ట్ ఫ్రెండ్స్. బీటెక్ పూర్తయిన తరువాత ఎంఎస్ చేయడానికి ఇద్దరూ అమెరికా వెళ్లారు. రూపక్ ప్రతీ రోజు ఉదయం లేదా రాత్రి తన తల్లిదండ్రులతో ఫోన్లో మాట్లాడేవాడు. మంగళవారం ఉదయం కూడా తనతో ఫోన్‌లో సరదాగా మాట్లాడినట్లు తండ్రి తెలిపారు. మంగళవారం సాయంత్రం బీచ్‌కు వెళ్లి బోటు ప్రమాదంలో మృతి చెందడంతో కుటుంబంలో విషాదఛాయలు అలుముకున్నాయి. చేతికందొచ్చిన కుమారుడు మృతి చెందడంతో తల్లిదండ్రులు రోదిస్తున్నారు. కుమార్తె ఎంబీబీఎస్ పూర్తి చేసి పీజీకి ప్రిపేరు అవుతుంది.