కర్నూలు జిల్లా, ఓర్వకల్లు మండలంలో ఆక్రమణకు గురైన ప్రభుత్వ భూములు స్వాధీనం చేసుకుంటామని తహసీల్దార్ వెంకటరమణ తెలిపారు. ఓర్వకల్లు గ్రామానికి చెందిన టీడీపీ నాయకులు రాంభూపాల్ రెడ్డి, గోవింద రెడ్డి ఫిర్యాదు మేరకు ఆక్రమణకు గురైన ప్రభుత్వ భూములను తహసీల్దార్ పరిశీలించారు. ఓర్వకల్లు బాలికల వసతి గృహం సమీపాన గల సర్వే నెంబర్.202లో 2ఎకరాల 75 సెంట్ల భూమి ఉందని, అందులో రూ. కోటి విలువ చేసే ఎకరా ప్రభుత్వ భూమిని శంకర్ రెడ్డి ఆక్రమించారని టీడీపీ నాయకులు ఫిర్యాదు చేయడంతో ఆ భూమిని తహసీల్దార్ వెంకటరమణ, సర్వేయర్ జయరాముడు, వీఆర్వో కృష్ణదేవరాయలు పరిశీలించారు. అధికారులు ఆక్రమణ గోడలను తొలగించేందుకు వీఆర్‌వోలు ఎక్స్‌కవేటర్లను తీసుకెళ్లారు. ఈ విషయం తెలిసిన వెంటనే మాజీ ఉప సర్పంచ నాగేశ్వరమ్మ భర్త శంకర్ రెడ్డి సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా ఎలా గోడలను తొలగిస్తారని అధికారులను నిలదీశారు. తమ భూమిని కొలతలు వేసి చూపించి అందులో ప్రభుత్వ భూమి ఉందని తెలిస్తే.. వాటిని అధికారులు స్వాధీనం చేసుకోవాలని తేల్చి చెప్పారు.దీనితో అధికారులు వెనుదిరిగి వెళ్లారు. ఈ విషయంపై పూర్తి స్థాయి సర్వే చేసి ప్రభుత్వ భూమిని స్వాధీనం చేసుకుంటామని తహసీల్దార్ వెంకటరమణ తెలిపారు.