కాకినాడ జిల్లాలో నీటి సంఘాల ఎన్నికల నిర్వహణకు అవసరమైన చర్యలు చేపట్టాలని కలెక్టర్ షాన్‌మోహన్ అధికారులను ఆదేశించారు. రాష్ట్ర ప్రభుత్వం నీటి సంఘాల ఎన్నికల నిర్వహణకు నిర్ణయించిన నేపథ్యంలో కాకినాడ కలెక్టరేట్‌లో గురువారం రెవెన్యూ, ఇరిగేషన్ అధికారుల తో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం మార్గదర్శకాల మేరకు జిల్లాలో నీటి సంఘాల ఎన్నికల నిర్వహణకు అవసరమైన చర్యలు చేపట్టాలన్నారు. జిల్లాలో గోదావరి, ఏలేరు, పంపా, సుబ్బారెడ్డిసాగర్ ఆయకట్టు కింద ఇప్పటికే నీటి సంఘాలు ఉన్నాయని, దీనికి సంబంధించి ప్రాదేశిక నియోజకవర్గం వారీగా అడంగల్ అనుసరించి రైతులు వివరాలు సిద్ధం చేయాల న్నారు. అలాగే తూర్పు ఆయకట్టు కింద నీటి సంఘాల ఎన్నికల నిర్వహణకు అవసమైన ప్రాదేశిక నియోజకవర్గం పరిధి నిర్ణయించేందుకు ఇరిగేషన్, రెవెన్యూ అధికారులు తగు చర్యలు చేపట్టాలన్నారు. ఈ సమావేశంలో జేసీ రాహుల్‌మీనా, డీఆర్వో తిప్పేనాయక్, ఆర్డీవోలు ఇట్ల కిషోర్, సీతారామరావు, ఇరిగేషన్ డీఈలు రవి, పోచారావు, పుష్కర కెనాల్ ఈఈ రాజేశ్వరరావు, శ్రీనివాసు పాల్గొన్నారు.