ఏపీసీపీడీసీఎల్ పరిధిలో గుంటూరు, సీఆర్‌డీఏ సర్కిల్స్‌లో ఉద్యోగుల బదిలీల కోలాహలం నెలకొంది. ఇప్పటికే బదిలీల మార్గదర్శకాలు విడుదలతో ఆ మేరకు అధికారులు కసరత్తు ప్రారంభించారు. బదిలీలకు సంబంధించి మూడు స్టేషన్‌లు ఎంపిక చేసుకునేలా ఉద్యోగులకు ఇచ్చిన ఆన్‌లైన్ ఆప్షన్స్ ఎంపిక గడువు గురువారం సాయంత్రంతో ముగిసింది. దీంతో గుంటూరు సర్కిల్ ఎస్‌ఈ ఆవుల మురళీకృష్ణయాదవ్, సీఆర్‌డీఏ సర్కిల్ ఎస్‌ఈ డాక్టర్ ప్రత్తిపాటి విజయ్‌కుమార్‌లు బదిలీల జాబితా రూపకల్పనలో నిమగ్నమయ్యారు. ఉమ్మడి గుంటూరు జిల్లాలో రెండు సర్కిల్స్ ఉండగా.. గుంటూరు సర్కిల్ పరిధిలో గుంటూరు-1, తెనాలి, నరసరావుపేట, మాచర్ల, బాపట్ల డివిజన్ కార్యాలయాలు ఉన్నాయి. సీఆర్‌డిఏ సర్కిల్ పరిధిలో గుంటూరు-2, అమరావతి డివిజన్ కార్యాలయాలు ఉన్నాయి. ఆయా కార్యాలయాల్లోని అర్హులైన క్లరికల్ సిబ్బందితో పాటు ఆపరేషన్ (ఓ అండ్ ఎమ్) విభాగంలో లైన్‌మెన్‌లు, లైన్ ఇన్‌స్పెక్టర్లు ఇతర సిబ్బంది బదిలీ కానున్నారు. మరో వైపు ఇంజనీరింగ్ అధికారులు కూడా బదిలీ కానున్నారు. ఇక ఉద్యోగ సంఘాల సభ్యులకు మాత్రం ఎనిమిదేళ్ల లోపు వారికి బదిలీల నుంచి మినహాయింపు కల్పించారు. శనివారం సాయంత్రానికి బదిలీల ప్రక్రియ పూర్తి చేసి ఉత్తర్వులు జారీ చేయనున్నారు. తాము కోరుకున్న స్టేషన్‌లో బదిలీ కోసం ఉన్నతాధికారులపై అధికార టీడీపీ నేతల నుంచి ఒత్తిడి తీసుకు వస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే అనేక మంది ఉద్యోగులు అధికార పార్టీ నేతల నుంచి సిఫార్సు లేఖలు తీసుకొచ్చారు. కీలక స్థానాలకు పోటీ ఎక్కువగా ఉండటంతో పాటు సిఫార్సు లేఖలు అధికారులకు తలనొప్పిగా మారాయి.