పరవళ్లు తొక్కుతున్న కృష్ణమ్మ సాగర్ బంధనాలను తెంచుకుంది. ఈ సీజన్‌లో రెండో సారి నాగార్జున సాగర్ గేట్లు మొత్తం ఎత్తి దిగువుకు నీటిని విడుదల చేశారు. నాగార్జున సాగర్‌కు ఎగువ నుంచి భారీగా వరద ప్రవహం కొనసాగుతోంది. దీంతో సాగర్ జలాశయం క్రస్ట్ గేట్లన్నీ మళ్లీ తెరుచుకున్నాయ్. జలాశయం 26 గేట్లు ఎత్తి నీటిని గురువారం విడుదల చేశారు. ఈ నెలలో గేట్లన్నీ తెరుచుకోవడం ఇది రెండో సారి. క్రస్ట్ గేట్ల నుంచి పాల నురగలా జాలువారుతున్న కృష్ణమ్మ సోయగాలను తనివితీరా చూసేందుకు పర్యాటకులు తరలివస్తున్నారు. డ్యాంకు వస్తున్న నీటిని వస్తున్నట్టుగా దిగువకు విడుదల చేస్తున్నారు. సాగర్‌లో నీటి మట్టం పూర్తి స్థాయికి చేరుకోవడంతో 26 క్రస్ట్ గేట్లలో 12 గేట్లను 5 అడుగులు, 14 గేట్లను 10 అడుగుల మేర ఎత్తి 3,07,382 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేశారు. పూర్తి స్థాయి సామర్థ్యం 312.05 టీఎంసీలకు 312.04 టీఎంసీల నీటి నిల్వ ఉంది. కుడి కాల్వ ద్వారా 9387, ఎడమ కాల్వ ద్వారా 8280, ప్రధాన జలవిద్యుత్ కేంద్రం ద్వారా 28,745, 26 క్రస్ట్ గేట్ల ద్వారా 3,07,382, ఎస్‌ఎల్‌బీసీ ద్వారా 1800, ఎల్‌ఎల్‌సీ ద్వారా 600 మొత్తం ఔట్‌ఫ్లో 3,56,194 క్యూసెక్కుల నీరు విడుదల చేస్తున్నారు. శ్రీశైలం నుంచి నాగార్జున సాగర్‌కు ఇన్‌ఫ్లో వాటర్‌గా 3,56,194 క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతోంది.