ప్రకాశం జిల్లా, అర్ధవీడు మండలం కాకర్లలో గురువారం అప్పుల బాధతో ఓ రైతు పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. గ్రామానికి చెందిన చిన్నదిబ్బారెడ్డి(42) నాలుగేళ్లుగా తనకున్న ఎనిమిది ఎకరాల్లో వివిధ రకాల పంట లు సాగుచేశాడు. ఏ పంట వేసినా సరిగా దిగుబడి రాలేదు. దీంతో సుమారు రూ.15 లక్షల మేర అప్పులు చేశాడు. ఈ ఏడాది బోర్ల కింద రెండెకరాల్లో పొగాకు నారుమడి పోశారు. మరో ఐదెకరాల్లో మిర్చి సాగు చేశారు. తీవ్ర వర్షాభావంతో వేసిన పైరు అంతా ఎండిపోయింది. ఓ వైపు అప్పులు, మరో వైపు పంట ఎండిపోవడంతో కుంగిపోయాడు. దీంతో బుధవారం సాయంత్రం పొలానికి వెళ్లి పురుగులమందు తాగాడు. చీకటిపడినా ఇంటికి రాకపోవడంతో కుటుంబసభ్యులు దిబ్బారెడ్డిని వెతుక్కుంటూ పొలం వద్దకు వెళ్లారు. గట్టుపై అపస్మారక స్థితిలో పడి ఉండడాన్ని గమనించి హుటాహుటిన కంభం వైద్యశాలకు తరలించారు. ప్రథమ చికిత్స అనంతరం మెరుగైన చికిత్స కోసం గుంటూరు వైద్యశాలకు తరలించగా అక్కడ చికిత్స పొందుతూ గురువారం మధ్యాహ్నం మృతిచెందాడు. మృతునికి భార్య, ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు.