కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తొలిసారిగా టీడీపీ, జనసేన అధినేతలైన ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు, ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్‌కల్యాణ్‌లు ఒకే వేదికపైకి రానున్నారు. పల్నాడు జిల్లా, నరసరావుపేట మండలం కాకాని వద్ద ఉన్న జేఎన్‌టీయూ కశాళాల ప్రాంగణంలో శుక్రవారం ఆటవీ శాఖ ఆధ్వర్యంలో వనమహోత్సవం జరగనున్నది. ఈ కార్యక్రమంలో సీఎం, డిప్యూటీ సీఎంల హోదాలో చంద్రబాబు, పవన్‌కల్యాణ్‌లు పాల్గొననున్నారు. చంద్రబాబు, పవన్‌కల్యాణ్ వేర్వేరుగా రెండు హెలిక్యాప్టర్లలో జేఎన్‌టీయూకు రానున్నారు. ఈ నేపథ్యంలో అధికారులు భారీగా ఏర్పాట్లు చేశారు. పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపట్టారు. చంద్రబాబు, పవన్ మొక్కలు నాటి వనమహోత్సావాన్ని ప్రారంభిస్తారు. అనంతరం జరిగే బహిరంగ సభలో వారు ప్రసంగించనున్నారు. ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు, ఉమ్మడి జిల్లాలోని ఎమ్మెల్యేలు సభకు హాజరుకానున్నారు. చంద్రబాబు, పవన్‌కల్యాణ్ పర్యటనకు సంబంధించిన ఏర్పాట్లను గురువారం కలెక్టర్ అరుణ్‌బాబు, ఎస్పీ శ్రీనివాసరావు, ఐజీ సర్వ శ్రేష్టి త్రిపాఠి, జాయింట్ కలెక్టర్ సూరజ్, ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ అరవిందబాబు తదితరులు పరిశీలించారు. సభకు హాజరయ్యే వారికి ఎటువంటి ఇబ్బందులు లేకుండా చర్యలు చేపట్టాలని వారు అధికారులను ఆదేశించారు. బందోబస్తు ఏర్పాట్లపై ఎస్పీ సమీక్షించారు.