గత వైసీపీ ప్రభుత్వంలో చింతలపూడి ఎత్తిపోతల పథకం పూర్తిగా నిర్లక్ష్యానికి గురైనట్లు మంత్రి నిమ్మల చెప్పారు. వరదల సమయంలో 90రోజులపాటు 53టీఎంసీల నీటిని ఎత్తిపోసేలా గత టీడీపీ ప్రభుత్వం ప్రాజెక్టు రూపకల్పన చేసిన విషయాన్ని మంత్రి గుర్తు చేశారు. ఈ ప్రాజెక్టు పూర్తయితే పశ్చిమ గోదావరి, కృష్ణా జిల్లాల్లోని 4.80 లక్షల ఎకరాలకు సాగునీరు అందుతుందని తెలిపారు. అలాగే 26లక్షల మందికి తాగునీటి అవసరాలు తీరుతాయని నిమ్మల వెల్లడించారు. ఈ ప్రాజెక్టు ద్వారా రెండు జిల్లాల్లో మెుత్తం 33మండలాలు, 410గ్రామాలకు లబ్ధి చేకూరుతుందని మంత్రి పేర్కొన్నారు. ఈ ఏడాది భారీ వర్షాలు కురవడంతో కృష్ణానదికి వరద పోటెత్తినట్లు మంత్రి నిమ్మల చెప్పారు. దీంతో నాగార్జున సాగర్ కుడికాలువ ఆయకట్టు కింద ఖరీప్ సీజన్‌లో పంటలు పండించేందుకు 15రోజుల ముందుగానే సాగునీరు విడుదల చేసినట్లు ఆయన వెల్లడించారు. నాగార్జునసాగర్ ఎడమ కాలువ జోన్-3లో చెరువులు పూర్తిస్థాయిలో నింపి ప్రజలకు తాగునీటి సమస్య లేకుండా చూడాలని అధికారులను మంత్రి నిమ్మల రామానాయుడు ఆదేశించారు.