ఝార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి చంపయీ సోరెన్ జేఎంఎంను వీడి బీజేపీలో చేరారు. కేంద్రమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్, అసోం సీఎం హిమంత బిశ్వశర్మ, ఝార్ఖండ్ బీజేపీ అధ్యక్షుడు బాబూలాల్ మరాండీ సమక్షంలో చంపయీ సోరెన్ కమలం పార్టీలో చేరారు. చంపయీ సోరెన్... జేఎంఎం వ్యవస్థాపకుడు శిబూసోరెన్‌కు అత్యంత సన్నిహితుడు. హేమంత్ సోరెన్ జైల్లో ఉన్నప్పుడు సీఎంగా పనిచేశారు. ఆయన బయటకు వచ్చాక ముఖ్యమంత్రి పదవి నుంచి తప్పుకున్నారు. ఆ తర్వాత పార్టీ తీరుపై ఆయన అసంతృప్తితో ఉన్నారు.బీజేపీలో చేరాలనే సంకల్పం మరింత పెరిగింది.తనపై ఝార్ఖండ్ ప్రభుత్వం నిఘా పెట్టిన తర్వాత బీజేపీలో చేరాలనే తన సంకల్పం బలపడిందని చంపయీ సోరెన్ అంతకుముందు అన్నారు. ఎన్నో చర్చల అనంతరం తాను బీజేపీలో చేరినట్లు చెప్పారు. బీజేపీ మాత్రమే అడవి బిడ్డల హక్కులను కాపాడుతుందని పేర్కొన్నారు.తాను ఇక గిరిజనుల తరఫున పోరాడుతానని తెలిపారు. గిరిజనుల జనాభా క్రమంగా తగ్గుతుందని, దీనిపై దృష్టి సారిస్తానని వెల్లడించారు. తనకు పార్టీ అప్పగించే బాధ్యతలను చిత్తశుద్ధితోనెరవేరుస్తానని వివరించారు.