కృష్ణా జిల్లా గుడ్లవల్లేరులోని ఇంజినీరింగ్ కాలేజ్‌లో రహస్య కెమెరాల అంశంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్న వేళ.. ఈ అంశంపై జరుగుతున్న విచారణను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. కాలేజీ హాస్టల్‌లో స్టూడెంట్స్ అర్ధరాత్రి తీవ్ర నిరసనలు, ఆందోళనలు వ్యక్తం చేయగా.. ఘటన విషయం తెలిసిన అధికారులు అలర్ట్ అయి చర్యలు చేపట్టారు. ఈ క్రమంలోనే వెంటనే జిల్లా అధికారులు, మంత్రి కొల్లు రవీంద్ర, జిల్లా ఎమ్మెల్యేలలను కళాశాలకు వెళ్లాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. ఇక గుడ్లవల్లేరులో జరుగుతున్న పరిణామాలను ఎప్పటికప్పుడు సీఎం అధికారుల ద్వారా తెలుసుకున్నారు.
ఈ ఘటనపై కృష్ణా జిల్లా కలెక్టర్, ఎస్పీలతో ఫోన్‌లో మాట్లాడిన సీఎం చంద్రబాబు విచారణ సాగుతున్న విధానంపై ఆరా తీశారు. ఈ వ్యవహారంలో ప్రస్తుతం జరుగుతున్న విచారణకు సంబంధించిన వివరాలను ప్రతి 3 గంటలకు ఒకసారి తనకు రిపోర్ట్ చేయాలని అధికారులను ఇప్పటికే సీఎం ఆదేశించారు. ఇక ఆ కాలేజీ హాస్టల్‌లోని విద్యార్థినుల ఆందోళనలు, ఆవేదనను పరిగణనలోకి తీసుకుని.. సమగ్రంగా దర్యాప్తు జరపాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. హాస్టల్ బాత్రూంలో ఏర్పాటు చేసిన స్పై కెమెరాల ద్వారా వీడియోలు తీశారన్న విషయంలో.. నేరం రుజువైతే దానికి సంబంధం ఉన్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని సూచించారు.
ఇక మన ఇంట్లో ఆడబిడ్డలకు కష్టం వస్తే ఎలా స్పందిస్తామో.. అంతే సీరియస్‌గా విచారణ జరిపి ఘటనలో నిజాలు నిగ్గు తేల్చాలని ఆదేశించారు. ఆందోళనలో ఉన్న విద్యార్థులు, వారి తల్లిదండ్రులకు భరోసా కల్పించాలని సూచించారు. అయితే గతంలోనే ఈ ఘటనపై విద్యార్థులు.. కాలేజీ యాజమాన్యం దృష్టికి తీసుకెళ్లి ఫిర్యాదు చేసినా వారు పట్టించుకోలేదనే ఆరోపణలు ఉన్నాయి. వాటిపైనా విచారణ జరపాలని అధికారులను ఆదేశించారు. కాలేజీ యాజమాన్యం, అధికారుల నిర్లక్ష్యం ఉంటే వారిపైనా చర్యలు తప్పవని సీఎం హెచ్చరించారు. ఇక విద్యార్థులు, తల్లిదండ్రులు ఎవరూ అధైర్య పడొద్దని.. ఈ వ్యవహారంపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటుందని ముఖ్యమంత్రి చంద్రబాబు హామీ ఇచ్చారు.