ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఏనుగులు, గుర్రాలు, అడవి దున్నలను చంపి మాంసం పంచనున్న ప్రభుత్వం

international |  Suryaa Desk  | Published : Fri, Aug 30, 2024, 09:50 PM

ప్రజల కోసం ప్రభుత్వాలు అనేక చర్యలు తీసుకుంటూ ఉంటాయి. ఏ దేశానికైనా, రాష్ట్రానికైనా.. తమ పరిధిలో ఉన్న ప్రజలకు మౌలిక వసతులు కల్పించాల్సిన బాధ్యత ఉంటుంది. ఇక ఆ దేశంలో కరువు, కాటకాలు, యుద్ధం, మహమ్మారి వంటి విపత్తులు సంభవించినపుడు.. ప్రజలకు ఆహారం, నీరు అందించి వారిని కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వాలదే. అయితే ఇలా కరువుతో అల్లాడుతున్న ప్రజల ఆకలిని తీర్చేందుకు ఓ దేశ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. దేశంలో ఉన్న వివిధ రకాల జంతువులను చంపి.. వాటి మాంసాన్ని ప్రజలకు పంచి వారిని ఆకలి నుంచి బయటపడేయాలని చూస్తోంది. అదే ఆఫ్రికా ఖండంలోని ఒక దేశమైన నమీబియా.


ప్రస్తుతం నమీబియాలో భయంకరమైన ఆకలి కేకలు వినిపిస్తున్నాయి. తినడానికి తిండి లేక జనం అల్లాడిపోతున్నారు. ఇక గత 100 ఏళ్లలో ఎన్నడూ లేని కరవుతో నమీబియా దేశం తీవ్ర ఆకలితో అలమటించిపోతోంది. ఈ నేపథ్యంలోనే ప్రజల ప్రాణాలు కాపాడేందుకు.. నమీబియా సర్కార్ సంచలన నిర్ణయాన్ని తీసుకుంది. కొన్ని అడవి జంతువులను చంపేసి.. వాటి మాంసాన్ని ప్రజలకు పంచడం ద్వారా వారి ఆకలిని కొంతవరకు తీర్చాలని నిర్ణయించింది. అయితే ఏ ఏ జంతువులను ఎన్నింటిని వధించాలి అనే దానిపై నమీబియా ప్రభుత్వం ఒక లిస్ట్ కూడా తయారు చేసి విడుదల చేసింది.


నమీబియాలోని 700 అడవి జంతువులను చంపేసి వాటి మాంసాన్ని దేశ ప్రజలకు పంచాలని తాజాగా ప్రభుత్వం నిర్ణయించింది. వాటిల్లో ఏనుగులు, జీబ్రాలు, నీటి గుర్రాలు, అడవి దున్నలు సహా రకరకాల జాతుల జంతువులు ఉన్నాయి. ఇక ఇదే విషయాన్ని నమీబియా పర్యావరణ, అటవీ, పర్యాటక మంత్రిత్వ శాఖ అధికారులు వెల్లడించారు. ఇక నమీబియా విడుదల చేసిన ఆ జంతువుల్లో 300 జీబ్రాలు, 100 బ్లూవైల్డ్‌ బీస్ట్‌లు, 83 ఏనుగులు, 60 అడవి దున్నలు, 50 ఇంఫాలాలు, 30 నీటి గుర్రాలు ఉన్నాయి. అయితే ఈ జంతువులు.. నమీబియా అడవులతోపాటు ఇతర ప్రాంతాల్లోనూ ఎక్కువగా ఉన్నాయని.. అందుకే వాటిలో కొన్నింటిని వధించి.. ప్రజల ఆకలిని తీర్చాలని నిర్ణయించుకున్నట్లు అక్కడి ప్రభుత్వం తెలిపింది.


ఇక ఇప్పటికే 150కి పైగా జంతువులను చంపేసి.. వాటి ద్వారా వచ్చిన 62.5 వేల కిలోల మాంసాన్ని ప్రజలకు అందించినట్లు అక్కడి ప్రభుత్వం వెల్లడించింది. ఇక వీటిని వధించడానికి నిపుణులైన వేటగాళ్ల సాయం తీసుకోవాలని నిర్ణయించుకుంది. నైరుతి ఆఫ్రికాలోని కరువు ప్రాంతాల్లో అల్లాడిపోతున్న ప్రజలకు సాయపడటమే దీని వెనుక ప్రధాన ఉద్దేశమని పేర్కొంది. ఈ సంవత్సలం నమీబియాలో కరవు తీవ్రత ఎక్కువగా ఉండటంతో.. నేషనల్ ఎమర్జెన్సీ కూడా విధించారు. దేశ జనాభాలో సగం మంది అంటే దాదాపు 14 లక్షల మంది ప్రజలు తీవ్ర ఆకలితో అలమటిస్తున్నారంటే అక్కడ పరిస్థితి ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు.







SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com