గుడ్లవల్లేరు ఇంజినీరింగ్ కాలేజీలో గత అర్ధరాత్రి (గురువారం) నుంచి 300 మంది విద్యార్ధినులు ఆందోళన చేస్తుంటే ప్రభుత్వం చోద్యం చూస్తోందని వైయస్ఆర్‌సీపీ అధికార ప్రతినిధి పుత్తా శివశంకర్ ఆక్షేపించారు. వారం రోజులుగా ఈ వ్యవహారం కొనసాగుతున్నా, దీనిపై విద్యార్థినిలు ఫిర్యాదు చేసినా కళాశాల యాజమాన్యం ఎందుకు తొక్కిపెట్టిందో చెప్పాలని కోరారు. అంతేకాక విషయం తెలియగానే పోలీసులకు ఎందుకు చెప్పలేదని? ఒకవేళ చెప్పినా వారు స్పందించలేదా? అని ప్రశ్నించారు. విద్యార్థినిల హాస్టల్‌లో కనీస సెక్యూరిటీ లేకపోతే ఎలా అని నిలదీశారు. ఈ ఘటనలో ప్రధాన నిందితుడు విజయ్ ఇన్‌స్టాగ్రామ్‌లో జనసేన పోస్టర్‌లు ఉన్నాయని తెలిపారు. ఈ ఘటనపై విచారణకు ఆదేశిస్తున్నామని ఒకవైపు ప్రభుత్వం చెబుతుండగా, మరోవైపు పోలీసులు ఇప్పటికే కేసు నిగ్గు తేల్చినట్లు మాట్లాడుతున్నారని, అక్కడ అలాంటిదేమి జరిగినట్లు ఆధారాలు లేవని చెబుతున్నారని శివశంకర్ గుర్తు చేశారు. రాష్ట్రంలో టీడీపీ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తర్వాత విద్యావ్యవస్ధ సర్వనాశనం అయిందని, నూజివీడు ట్రిపుల్ ఐటీలో దాదాపు వెయ్యి మంది విద్యార్ధులు కలుషిత ఆహారం తిని ఆసుపత్రుల పాలైనా, ప్రభుత్వం పట్టించుకోలేదని శివశంకర్ ఆక్షేపించారు.