ఎన్టీఆర్ జిల్లా మైలవరంలోని పలు మండలాల్లో వరద ఉధృతి కొనసాగుతోంది. బుడమేరులో వరద ప్రమాదకరంగా ప్రవహిస్తుండటంతో పుల్లూరు, మొర్సుమిల్లి, తెలంగాణ రాష్ట్రానికి రాకపోకలు నిలిచిపోయాయి. పుల్లూరు సమీపంలో బుడమేరులో చిక్కుకున్న ప్రైవేట్ కాలేజీ బస్సును తాడు సహాయంతో గ్రామస్తులు లాగారు. జి.కొండూరు మండల పరిధిలోని కుంటముక్కల వద్ద వరద ఉధృతంగా ప్రవహిస్తుండటంతో విజయవాడ- ఛత్తీస్ ఘడ్ జాతీయ రహదారిపై వాహనాల రాకపోకలను అధికారులు నిలివేశారు. రెడ్డిగూడెం మండలం కూనపరాజుపర్వలో ఇళ్లు నీట మునిగాయి. జి.కొండూరు లోని పులివాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. 15 ఏళ్ల తర్వాత వంతెన పైకి వరద ప్రవాహం వచ్చి చేరింది. ఓబుళాపురం - నరుకుళ్లపాడు వద్ద రోడ్డుపై నాగసాని పాటి వారి చెరువుకు వెళ్లే వాగు ప్రవహిస్తోంది. దీంతో ఓబుళాపురానికి రాకపోకలు బంద్ అయ్యాయి. మైలవరం సమీపంలోని కొండవాగు ధాటికి వరి, పత్తి పొలాలు నీట మునిగాయి.