బంగాళాఖాతంలో వాయుగుండం ప్రభావంతో ఏపీలో రాబోయే 2 రోజులు భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని వాతావరణ శాఖ ప్రకటించింది. ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా ఎన్టీఆర్, విశాఖ, గుంటూరు, మన్యం, అల్లూరి, ఏలూరు, ప్రకాశం జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి.ఈ క్రమంలో దక్షిణ మధ్య రైల్వే కీలక ప్రకటన చేసింది. విజయవాడ మీదుగా నడిచే 20 రైళ్లను రాబోయే 2 రోజుల పాటు రద్దు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు.
విజయవాడ - తెనాలి
తెనాలి - విజయవాడ
విజయవాడ - గూడూరు
గూడూరు - విజయవాడ
విజయవాడ - కాకినాడ పోర్టు
తెనాలి - రేపల్లె
రేపల్లె - తెనాలి
గుడివాడ - మచిలీపట్నం
మచిలీపట్నం - గుడివాడ
భీమవరం - నిడదవోలు
నిడదవోలు - భీమవరం
నర్సాపూర్ - గుంటూరు
గుంటూరు - రేపల్లె
రేపల్లె - గుంటూరు
గుంటూరు - విజయవాడ
విజయవాడ - నర్సాపూర్
ఒంగోలు - విజయవాడ
విజయవాడ - మచిలీపట్నం
మచిలీపట్నం - విజయవాడ
విజయవాడ - ఒంగోలు రైళ్లను 2 రోజులు రద్దు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు.
విజయవాడలో నీట మునిగిన రహదారులు
భారీ వర్షాలతో విజయవాడ, గుంటూరు నగరాల్లోని ప్రధాన రహదారులు జలమయమయ్యాయి. రోడ్లన్నీ చెరువులను తలపిస్తున్నాయి. విజయవాడలోని విద్యాధరపురం, ఆర్ఆర్ నగర్లో రహదారులు జలమయం కాగా.. వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పలు చోట్ల మోకాళ్ల లోతు నీరు చేరి ప్రజలు అవస్థలు పడుతున్నారు. విజయవాడ బస్టాండ్ పరిసరాలు నీట మునిగాయి. రామవరప్పాడు రింగ్ రోడ్డు వద్ద భారీగా ట్రాఫిక్ నిలిచిపోయింది. బెంజ్ సర్కిల్ ఫ్లై ఓవర్ కింద భారీగా వర్షపు నీరు చేరి జాతీయ రహదారిపై రాకపోకలకు ఇబ్బంది ఏర్పడింది. విజయవాడలోని దుర్గగుడి ఫ్లైఓవర్ను తాత్కాలికంగా మూసేశారు. బ్రిడ్జి వద్ద వర్షపు నీరు చిక్కుకుని 3 బస్సులు, ఓ లారీ అందులో చిక్కుకున్నాయి. భారీ వర్షాలకు గుంటూరు నగరంలోని గడ్డిపాడు చెరువు పొంగిపొర్లుతోంది. అటు, మంగళగిరి టోల్ ప్లాజా వద్ద జాతీయ రహదారిపై నీరు చేరి రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. దీంతో గుంటూరు - విజయవాడ ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గడిచిన 24 గంటల్లో మచిలీపట్నం 19 సెం.మీ, విజయవాడ 18, గుడివాడ 17, కైకలూరు 15, నర్సాపురం 14, అమరావతి 13, మంగళగిరి 11, నందిగామ, భీమవరం 10, పాలకొల్లు, తెనాలిలో 9 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు అధికారులు తెలిపారు.
బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర అల్పపీడనం వాయుగుండంగా మారిన క్రమంలో శనివారం అర్ధరాత్రి విశాఖ - గోపాల్పూర్ మధ్యలో తీరం దాటే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. దీని ప్రభావంతో రాబోయే 3 రోజుల్లో ఎన్టీఆర్, పశ్చిమగోదావరి, ఏలూరు, అల్లూరి మన్యం, ప్రకాశం జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని వెల్లడించారు. అటు, అనంతపురం, కర్నూలు, నంద్యాల, పల్నాడు, బాపట్ల, గుంటూరు, విశాఖ, కృష్ణా, కోనసీమ, కాకినాడ, అనకాపల్లి, విజయనగరం జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు.