విజయవాడ పోలీసులు తెలంగాణ యువకుడు చేసిన ఫిర్యాదుపై స్పందించి.. అరగంటలోనే ఆ కేసును పరిష్కరించారు. ఇక కష్టం అనుకున్న సమయంలో.. ఆయన ల్యాప్‌టాప్‌ను కనిపెట్టి తిరిగి అప్పగించారు. తెలంగాణలోని మహబూబాబాద్‌కు చెందిన చేగాని రాంబాబు ఇండస్ బ్యాంకు నందు పనిచేస్తుంటారు. ఆయన శుక్రవారం రోజు ఏలూరు నుంచి విజయవాడకు ఆర్టీసీ బస్సులో ప్రయాణం చేస్తూ విజయవాడ బెంజ్ సర్కిల్‌లో దిగిన తర్వాత సామాన్లు చెక్ చేసుకోగా ల్యాప్ టాప్ లేదని గమనించారు. అది
బస్సులోనే ఉండిపోయిందని వెంటనే విజయవాడ సిటీ పోలీస్ కంట్రోల్ రూమ్‌కి ఫోన్ చేసి ఫిర్యాదు చేశారు.
కాల్ వచ్చిన వెంటనే పోలీసులు కంట్రోల్ రూమ్ సిబ్బంది వెంటనే స్పందించి ఆ సమయంలో విధుల్లో ఉన్న కృష్ణలంక రక్షక్‌కు తెలియగానే.. అప్పుడు విధుల్లో ఉన్న హెడ్ కానిస్టేబుల్ జే శివ ప్రసాద్, పోలీస్ కానిస్టేబుల్ విజయ్ బాబు వెంటనే స్పందించి ఆర్టీసీ బస్టాండ్‌లో తనిఖీ చేసి ల్యాప్ టాప్ బాధితుడు వచ్చిన బస్సులో ఉందని గుర్తించి అనంతరం బాధితుల్ని పిలిపించి ల్యాప్‌టాప్ అందజేశారు. అలాగే పోగట్టుకున్న తన ల్యాప్ టాప్ వెంటనే గుర్తించి అందజేయడంతో.. ఆనందంతో ఎన్టీఆర్ జిల్లా పోలీసులుకు ధన్యవాదాలు తెలిపారు. సమాచారం అందుకున్న అరగంటలోపు ల్యాప్ టాప్‌ను గుర్తించి బాధితునికి అందజేయడంలో ముఖ్యపాత్ర వహించిన పోలీన్ కంట్రోల్ రూమ్ సిబ్బందిని, హెడ్ కానిస్టేబుల్ శివప్రసాద్, కానిస్టేబుల్ విజయబాబులను పోలీస్ కమిషనర్ ఎన్వీ రాజశేఖర్ బాబు అభినందించారు.
విజయవాడలో జరుగుతున్న నేరాలపై పోలీసులు ప్రజల్లో అవగాహన కల్పిస్తున్నారు. నేరాలు జరిగిన తర్వాత దర్యాప్తు చేయడం కంటే.. ముందుగానే జాగ్రత్తలు అవసరం అంటున్నారు పోలీసులు. విజయవాడలోని ముఖ్య ప్రాంతాల్లో, అపార్ట్‌మెంట్‌లలో దొంగతనాలు జరగకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఎవరైనా ఊరు వెళ్లే సమయంలో తప్పనిసరిగా లోకల్ పోలీసులకు సమాచారం అందించాలని సూచించారు. ఎల్‌హెచ్‌ఎంఎస్‌ను ఉపయోగించుకుంటే.. ఒకవేళ ఎవరైనా దొంగ ఇంటిలోకి వస్తే వెంటనే అలారం మోగుతుందన్నారు. పోలీస్ స్టేషన్ కు సమాచారం చేరి దొంగలను పట్టుకోవచ్చన్నారు. అలాగే ఊరికి వెళ్లే ముందు విలువైన వస్తువుల్ని లాకర్లలో జాగ్రత్త చేసుకోవాలన్నారు. సీసీ కెమెరాలు, వాచ్‌మెన్ వంటి జాగ్రత్తలు తీసుకోవాలన్నారు.
మరోవైపు ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనరేట్ పరిధిలోని అజిత్ సింగ్ నగర్ పోలీస్ స్టేషన్‌లో నమోదైన దాడి చేసిన కేసులో ముగ్గురు నిందితులకు.. నాలుగో అడిషనల్ చీఫ్ జ్యూడిషియల్ మెజిస్ట్రేట్ యు. రామ్మోహన్ రావు 6 నెలల కఠినకారాగార జైలు శిక్ష మరియు ఒక్కొక్కరికి రూ.2500 జరిమానా విధించారు. అలాగే మద్యం సేవించి వాహనాలు నడిపిన 19 మంది వ్యక్తులుకు కోర్టు జరిమానా విధించింది కోర్టు.