ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కాంగ్రెస్‌లోకి వినేష్ ఫోగట్, హర్యానా ఎన్నికల్లో పోటీ

national |  Suryaa Desk  | Published : Sat, Aug 31, 2024, 09:41 PM

భారత స్టార్ రెజ్లర్ వినేష్ ఫోగట్ రాజకీయాల్లోకి అడుగుపెడుతున్నారనే వార్త గత కొన్ని రోజులుగా మీడియాలో, సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఇటీవల జరిగిన పారిస్ ఒలింపిక్స్ 2024లో మహిళల రెజ్లింగ్ విభాగంలో ఫైనల్‌కు ముందు 100 గ్రాములు అధిక బరువు ఉందన్న కారణంతో ఆమె పతకం కోల్పోవడమే కాకుండా టోర్నీ నుంచే బహిష్కరణకు గురయ్యారు. ఈ క్రమంలోనే ఆమె తన రెజ్లింగ్ కెరీర్ ముగిస్తున్నట్లు ప్రకటన చేశారు. దీంతో ఆమె రాజకీయాల్లోకి వస్తున్నారనే వార్తకు మరింత బలం చేకూరింది. ప్రస్తుతం హర్యానా అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న వేళ.. వినేష్ ఫోగట్ కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకుని.. హస్తం పార్టీ గుర్తుపై ఎమ్మెల్యేగా బరిలోకి దిగనున్నారనే ప్రచారం గత కొన్నిరోజులుగా జోరుగా సాగుతోంది. ఈ వ్యవహారంపై తాజాగా ఆమె స్పందించారు.


గత కొన్ని నెలలుగా తమ డిమాండ్లు తీర్చాలంటూ రైతులు ఆందోళన చేస్తున్నారు. వారి ఆందోళనలు 200 రోజులకు చేరుకున్న వేళ.. ఢిల్లీ హర్యానా సరిహద్దుల్లో ఉన్న శంభూ బోర్డర్ వద్ద రైతులు చేస్తున్న ఆందోళనల్లో శనివారం వినేష్ ఫోగట్‌ పాల్గొని వారికి మద్దతు తెలిపారు. రైతుల డిమాండ్లను ప్రభుత్వం ఆమోదించాలని ఆమె ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఆమె కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారనే వార్తలు వైరల్ అవుతున్న నేపథ్యంలో.. అదే ప్రశ్నను ఆమెను మీడియా ప్రతినిధులు అడిగారు. అయితే రాజకీయాల అంశంపై తాను ఇప్పుడు, ఇక్కడ మాట్లాడదల్చుకోలేదని చెప్పారు.


తన రైతుల కుటుంబాన్ని కలుసుకోవడానికే తాను శంభూ సరిహద్దులకు వచ్చినట్లు వినేష్ ఫోగట్ తెలిపారు. ఇప్పుడు మీడియా దృష్టి తన వైపు తిరిగితే.. గత కొన్ని నెలలుగా రైతులు చేస్తున్న పోరాటం, కష్టాలు వృథా అవుతాయని సున్నితంగా ఆ ప్రశ్నను పక్కన పెట్టారు. రైతుల ఆందోళనల ప్రాంతంలో మీడియా ఫోకస్‌ తనపై ఉండకూడదని.. అన్నదాతలపై మాత్రమే ఉండాలని ఆమె విజ్ఞప్తి చేశారు. తాను ఒక క్రీడాకారిణిని అని.. భారతీయురాలిని అని.. ఎన్నికలపై తనకు ఎలాంటి ఆందోళన లేదని.. తన దృష్టి మొత్తం రైతుల సంక్షేమంపై మాత్రమే ఉందని వినేష్ ఫోగట్ తేల్చి చెప్పారు.


ఇక రైతులు చేపట్టిన ఆందోళన 200వ రోజుకు చేరిన సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొన్న వినేష్ ఫోగట్.. వారికి సంఘీభావంగా దీక్షలో కూర్చున్నారు. అనంతరం మాట్లాడుతూ.. మీ కుమార్తె మీ వెంటే ఉంటుందని రైతులకు భరోసా ఇచ్చారు. ఇక తాను రైతు కుటుంబంలో పుట్టినందుకు అదృష్టవంతురాలిని అని చెప్పారు. రైతుల హక్కుల కోసం మనం నిలబడాలని.. ఎవరూ రారని పేర్కొన్నారు. రైతుల డిమాండ్లను ప్రభుత్వాన్ని తీర్చాలని ఈ సందర్భంగా ఆ దేవుడిని ప్రార్థిస్తున్నట్లు చెప్పారు. డిమాండ్లు సాధించుకోకుండా వెనుదిరగ వద్దని ఈ సందర్భంగా అన్నదాతలకు వినేష్ ఫోగట్ సూచించారు.


ఇక తమ హక్కుల కోసం 200 రోజుల నుంచి రైతులు కూర్చొని ఉన్నారని.. వారి డిమాండ్లను పూర్తి చేయాలని ఈ సందర్భంగా తాను ప్రభుత్వాన్ని కోరుతున్నట్లు వినేష్ ఫోగట్ చెప్పారు. కానీ కేంద్ర ప్రభుత్వం ఇన్ని నెలలుగా రైతుల డిమాండ్లు వినకపోవడం బాధాకరమని తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. దేశ రాజధాని ఢిల్లీలోనే ర్యాలీ చేపట్టి ఆందోళన చేయాలని రైతులు నిర్ణయించుకోగా.. అందుకు అధికారులు నిరాకరించారు. దీంతో ఈ ఏడాది ఫిబ్రవరి 13వ తేదీ నుంచి.. ఢిల్లీ హర్యానా బోర్డర్‌లో ఉన్న శంభూ ప్రాంతం వద్దే రైతులు ఆందోళన చేపట్టారు. పంటలకు చెల్లించే కనీస మద్దతు ధరకు ప్రభుత్వం గ్యారెంటీ ఇవ్వాలని రైతులు ప్రధానంగా డిమాండ్‌ చేస్తున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com