పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం శనివారం బలపడి వాయుగుండంగా మారి స్థిరంగా కొనసాగుతోంది. ప్రస్తుతం విశాఖపట్నానికి ఈశాన్యంగా 80 కిలోమీటర్లు, కళింగపట్నానికి నైరుతిగా 40 కిలోమీటర్లు, ఒడిశాలోని గోపాల్‌పూర్‌కి నైరుతిగా 160 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉన్నట్టు భారత వాతావరణ విభాగం వెల్లడించింది. వాయుగుండం గంటకు 6 కి.మీ. వేగంతో కదులుతోందని, ఆదివారం కళింగపట్నం వద్ద తీరం దాటే అవకాశం ఉందని అంచనా వేసింది. దీని ప్రభావంతో రాష్ట్రంలో ముఖ్యంగా కోస్తా, రాయలసీమలోని కొన్ని చోట్ల భారీ నుంచి అతిభారీ వర్షాలు, కొన్ని ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు కురుస్తాయని తెలిపింది.
పశ్చిమ, వాయవ్యదిశగా కదులుతోన్న ఈ అల్పపీడనం శనివారం రాత్రి తీరం దాటే అవకాశం ఉందని ముందు అంచనా వేశారు. కానీ, ఇది ఆ ప్రాంతంలో స్థిరంగా ఉండటంతో ఆదివారం ఉదయం తీరం దాటుతుందని భావిస్తున్నారు. ఇక, అరేబియా సముద్రంలో ఏర్పడిన తుఫాను అస్నా కేంద్రం నుంచి బంగాళాఖాతంలోని వాయుగుండం కేంద్రం వరకు రుతుపవన ద్రోణి కొనసాగుతోందని అమరావతి వాతావరణ కేంద్రం పేర్కొంది. వీటి ప్రభావంతో శనివారం రాష్ట్రవ్యాప్తంగా భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిశాయి.
ఆదివారం కూడా రాష్ట్రంలోని పలు జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయని అధికారులు పేర్కొన్నారు. ఎన్టీఆర్, పల్నాడు, కర్నూలు, నంద్యాల, అల్లూరి సీతారామరాజు, ఏలూరు, కృష్ణా, గుంటూరు, ప్రకాశం, అనంతపురం, వైఎస్సార్ జిల్లాల్లో అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, మిగిలిన జిల్లాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలకు ఛాన్స్ ఉందని తెలిపారు. సముద్రంలో పరిస్థితి అల్లకల్లోలంగా ఉందని, మత్స్యకారులు వేటకు వెళ్లరాదని హెచ్చరించారు.
ఇక, రాష్ట్రంలోని కళింగపట్నం, విశాఖపట్నం, గంగవరం, కాకినాడ, మచిలీపట్నం, నిజాంపట్నం, కృష్ణపట్నం పోర్టుల్లో మూడో నంబరు ప్రమాద హెచ్చరికలు జారీచేశారు. శనివారం గుంటూరు, ఎన్టీఆర్, ఏలూరు, బాపట్ల, పల్నాడు, పార్వతీపురం మన్యం, ప్రకాశం సహా పలు జిల్లాల్లో భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురిశాయి. అత్యధికంగా గుంటూరు జిల్లా మంగళగిరిలో 27.9 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది.
అటు, గురువారం రాత్రి నుంచి ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాలకు విజయవాడ నగరంలోని మొగల్రాజపురంలో కొండచరియలు విరిగిపడ్డాయి. దీంతో పలు ఇల్లు ధ్వంసం కాగా.. ఆరుగురు మృతిచెందారు. మరో నలుగురు తీవ్రంగా గాయపడగా వారిని రక్షించి ఆస్పత్రికి తరలించారు. అలాగే, గుంటూరు జిల్లా ఉప్పలపాడులో కారు కొట్టుకుపోగా.. అందులోని ప్రయాణిస్తున్న ముగ్గురు చనిపోయారు. కొండచరియలు విరిగిపడి మరో వృద్ధురాలు మరణించారు. ఇప్పటి వరకూ వర్షాలకు 8 మంది చనిపోయారు.