మండలంలోని కృష్ణా నది సమీపంలో లంక గ్రామాలు పూర్తిగా వరద నీటిలో మునిగిపోయాయి. రాయపూడి పెదలంకలో సుమారు 300 పాడి గేదెలు వరద నీటిలో కొట్టుకుపోయాయి.సుమారు 300 మంది గ్రామస్థులను సమీపంలోని ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం పునరావాస కేంద్రానికి తరలించారు. ఇంకా సుమారు 70 మంది బాధితులు పెదలంకలోనే ఉన్నారు. వారంతా ఇళ్లపైకి ఎక్కి సాయం కోసం అభ్యర్థిస్తున్నారు. హెలికాఫ్టర్ల ద్వారా వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు జిల్లా యంత్రాంగం చర్యలు చేపట్టింది. గ్రామంలో 170 కుటుంబాలు ఉండగా.. సుమారు 400 మంది జనాభా నివసిస్తున్నారు.
కృష్ణా నదిలో వరద ఉద్ధృతి కారణంగా మంతెన సత్యనారాయణ ఆశ్రమం సమీపంలో కరకట్టకు ఉన్న గేటు వద్ద వరద నీరు లీక్ అవుతోంది. ఆదివారం అర్ధరాత్రి ఆ ప్రాంతాన్ని మంత్రి నిమ్మల రామానాయుడు, ఎమ్మెల్యే తెనాలి శ్రవణ్‌కుమార్, సీఆర్డీఏ కమిషనర్ కాటంనేని భాస్కర్ పరిశీలించారు. కంకర, ఇనుప షీట్లు వేసి జేసీబీల సాయంతో వరద నీటిని నిలిపేందుకు అధికారులు, స్థానికులు తీవ్రంగా శ్రమించారు. సుమారు 5 గంటలపాటు వరద నీటిని అరికట్టడానికి ప్రయత్నించారు. కానీ మళ్లీ లీకేజీ ప్రారంభమైంది. సోమవారం ఉదయం కరకట్ట వద్ద వరద నీరు లీక్ అవుతున్న ప్రాంతాన్ని సీఆర్డీఏ అధికారులు పరిశీలించారు. కంకర వేసి వరదను అరికట్టాలని సిబ్బందికి సూచించారు. తుళ్లూరు మండలం హరిశ్చంద్రపురం గ్రామం పూర్తిగా జలదిగ్భందమైంది. కృష్ణానది వరద గ్రామాన్ని చుట్టుముట్టింది. పంట పొలాలు, గృహాలు నీటమునిగాయి. ఈ గ్రామానికి సమీపంలోని కరకట్టకు గండి పడే అవకాశం ఉందని రైతులందరూ కలిసి ఇసుక బస్తాలతో అడ్డుకట్ట వేశారు.