ప్రజలను కాపాడే విషయంలో ప్రయత్నాలు ఎక్కడా ఆగకూడదని ఏపీ సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. వరద పరిస్థితిపై సోమవారం ఉదయం విజయవాడ కలెక్టరేట్‌లో అధికారులతో ఆయన ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు.ఒక్క రాత్రి ధైర్యంగా ఉండాలని ముంపు ప్రాంతాల ప్రజలకు హామీ ఇచ్చానని సీఎం చంద్రబాబు తెలిపారు. ఆ హామీ నిలబెట్టుకునే దిశగా యంత్రాంగం పనిచేయాలన్నారు. ఎంతమందిని రక్షించగలిగామన్నదే మన లక్ష్యం కావాలన్నారు. బోట్లు కూడా కొట్టుకుపోయే సవాళ్లు మన ముందున్నాయన్నారు. బోట్లలో వచ్చిన వారిని తరలించేందుకు బస్సులు సిద్ధంగా ఉంచాలన్నారు.. అవసరమైతే వృద్ధులు, రోగులు ఇబ్బంది పడకుండా హోటళ్లలోనే ఉంచాలని ఆదేశించారు. బాధితుల కోసం కల్యాణ మండపాలు, ఇతర కేంద్రాలు సిద్ధం చేయాలన్నారు. మొత్తం 47 కేంద్రాలు గుర్తించామని సీఎంకు అధికారులు వివరించారు.ఉదయం 8 గంటల కల్లా ఎంత మందికి ఆహారం అందించారని సీఎం ఆరా తీశారు. సుమారు లక్షన్నర మంది వరకు ఆహార పంపిణీ జరిగిందని అధికారులు తెలిపారు. విపత్తు సమయంలో వరద బాధితులు తీసుకునే తాగునీరు ఎంతో ముఖ్యమని చంద్రబాబు చెప్పారు. అందుబాటులో ఉన్న మినరల్ వాటర్ వారి కోసమే కేటాయించాలన్నారు. కృష్ణానది కరకట్టపై వెంకటపాలెం వద్ద గండి పడే పరిస్థితిపై సీఎం ఆరా తీశారు. గండిని పూడ్చగలిగామని సీఎంకు అధికారులు వివరించారు. రాజధాని రైతులు స్వచ్ఛందంగా చూపిన చొరవను ముఖ్యమంత్రి అభినందించారు. కరకట్ట వెంట గండి పడే ప్రాంతాల గుర్తింపునకు ప్రత్యేక బృందం ఏర్పాటు చేయాలన్నారు. తనతో సహా అధికారులంతా బృందంగా ఏర్పడాలని స్పష్టం చేశారు.
విజయవాడ సింగ్‌నగర్ ప్రాంతంలో సీఎం చంద్రబాబు పర్యటించారు. జోరు వర్షంలో బోటు ఎక్కి సింగ్ నగర్ లోపలికి వెళ్లారు. దాదాపు వంతెనకు ఆనుకుని ప్రవహిస్తున్న వరద నీటిని సీఎం పరిశీలించారు. బాధితులకు ఉదయమే ఆహారం అందిందా? లేదా? అని చంద్రబాబు ఆరా తీశారు. ఆహారం, రక్షిత మంచి నీరు అందాయని బాధితులు ఆయనకు తెలిపారు.