ఎన్టీఆర్ జిల్లా మైలవరం నియోజకవర్గ పరిధిలోని జి. కొండూరు మండలంలో బుడమేరు వరదలో మహిళ గల్లంతైంది. ఆదివారం సాయంత్రం బుడమేరు వరదలో జి.కొండూరు నుంచి హెచ్.ముత్యాలంపాడు గ్రామానికి ట్రాక్టర్‌పై వెళ్లేందుకు గ్రామస్తులు ప్రయత్నించారు.వరద ధాటికి ట్రాక్టర్ కొట్టుకుపోయింది. ప్రమాద సమయంలో ట్రాక్టర్ పై 10 మంది గ్రామస్థులు ఉన్నారు. వరదలో కొట్టుకుపోతున్న వారిలో 9 మందిని స్థానికులు రక్షించారు. గొర్రె శివపార్వతి (35) అనే మహిళ మాత్రం గల్లంతైంది. బుడమేరు వరదలో గల్లంతైన మహిళ కోసం గజ ఈతగాళ్లు గాలిస్తున్నారు. గాలింపు చర్యలను మైలవరం ఏసీపీ మురళీమోహన్, జి.కొండూరు తహసీల్దార్, ఎంపీడీఓలు పర్యవేక్షిస్తున్నారు.
వెలగలేరు జగనన్న లే అవుట్ బుడమేరు వరదలో పూర్తిగా మునిగిపోయింది. ఇంకా ముంపులోనే హెచ్.ముత్యాలంపాడు గ్రామం ఉంది. బుడమేరు వరద ధాటికి వందల ఎకరాల్లో పత్తి, వరి పొలాలు నీట మునిగాయి. బుడమేరుతో పాటు వరద ప్రభావిత ప్రాంతాల్లోని పరిస్థితిపై సీఎం చంద్రబాబు సమీక్షించారు. ఈ సమీక్ష సమావేశంలో మంత్రులు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. విధుల్లో ఉన్న హెలికాప్టర్ ద్వారా అందుతున్న సాయంపై చంద్రబాబు వివరాలు అడిగి తెలుసుకున్నారు. మిగిలిన హెలికాప్టర్లను కూడా వీలైనంత త్వరగా రప్పించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఆహార పంపిణీ ఎంత మేరకు చేశారో డివిజన్ల వారీగా చంద్రబాబు అడిగి తెలుసుకున్నారు.
ఇతర జిల్లాల్లో తయారు చేసి తరలిస్తున్న ఆహారంపై కూడా చంద్రబాబు ఆరా తీశారు. పునరావాస కేంద్రాలకు వచ్చే వారికి దుస్తులు సిద్ధంగా ఉంచాలని ఆదేశించారు. బాధితుల సెల్ ఫోన్ ఛార్జింగ్ కోసం పవర్ బ్యాంకులు కూడా ఏర్పాటు చేయాలని సూచించారు. కమ్యునికేషన్ లో అంతరాయం ఏర్పడకుండా చూడాలని చంద్రబాబు పేర్కొన్నారు. ఆహారంతో పాటు పండ్ల పంపిణీకి కూడా ఏర్పాట్లు చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేయడం జరిగింది. రానున్న రెండు రోజుల్లో బాధితులకు అందించేందుకు కూరగాయలు కూడా అందుబాటులో ఉంచుకోవాలని ఆదేశించారు. సమస్యను రెండు, మూడు రోజుల పాటు ఎదుర్కొనేందుకు అధికార యంత్రాంగం సిద్ధంగా ఉండాలని చంద్రబాబు ఆదేశించారు.