ఏపీ ప్రజలకు ముఖ్యమైన గమనిక.. భారీ వర్షాలు, వరదలతో విద్యుత్ సరఫరా పలు జిల్లాల్లో నిలిచిపోయింది. ఈ క్రమంలో అధికారులు కీలక ప్రకటన చేశారు.. ఒకవేళ ఎక్కడైనా విద్యుత్ సరఫరాకు అంతరాయం కలిగితే టోల్ ఫ్రీ నంబర్ 1912ను సంప్రదించాలని సూచించారు. అలాగే స్థానికంగా ఏర్పాటు చేసిన హెల్ప్‌లైన్‌కు ఫిర్యాదు చేయాలని తెలిపారు. గత రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో పలు లోతట్టు ప్రాంతాలను నీళ్లు ముంచెత్తాయి. కొన్ని పలు కాలనీల్లోనూ మోకాళ్లకు పైగా నీరు నిలిచిపోయాయి. అందుకే ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా విద్యుత్‌శాఖ అధికారులు సరఫరా నిలిపివేశారు. విద్యుత్ సరఫరా పునరుద్ధరణ చర్యలపై ఫోకస్ పెట్టారు.
ఈ భారీ వర్షాల కారణంగా ఇంధనశాఖకు రూ.101 కోట్ల నష్టం వాటిల్లినట్లు ప్రాథమికంగా అంచనా వేశారు. అంతేకాదు ఈ భారీ వర్షాలతో బుడమేరులో ప్రవాహం పెరగడంతో.. విజయవాడ వీటీపీఎస్‌లోని నీరు బయటకు వెళ్లే అవకాశం లేకుండా పోయింది. దీంతో బొగ్గు నిర్వహణ ప్రాంతం, కన్వేయర్లు కూడా నీట మునిగాయి. అధికారులు సాంకేతిక ఇబ్బందులు తలెత్తకుండా మొత్తం ఆరు యూనిట్లలో ఉత్పత్తిని నిలిపివేశారు. అక్కడ నిలిచిపోయిన నీటిని మోటార్ల ద్వారా తోడిన తర్వాత 5వ యూనిట్‌ను ఆదివారం సాయంత్రానికి ఉత్పత్తి ప్రారంభమైంది. ఆరో యూనిట్ కూడా ఇవాళ ఉదయానికి అందుబాటులోకి తీసుకొచ్చారు. అయితే మిగిలిన నాలుగు యూనిట్ల నుంచి విద్యుత్ ఉత్పత్తి పునరుద్ధరించడానికి 48 గంటలు పట్టే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.
మరోవైపు ఎడతెరపిలేకుండా వర్షాలు కురుస్తుండటంతో విద్యుత్ అధికారులు అప్రమత్తంగా ఉండాలని మంత్రి గొట్టిపాటి రవి కుమార్ సూచించారు. విద్యుత్ సరఫరాలో అంతరాయం లేకుండా చూడాలని, ప్రమాదాల నివారణపై అధికారులు దృష్టి సారించాలని అన్నారు. రైతులు కూడా అప్రమత్తంగా ఉండాలని, ప్రజలు కూడా అవసరం అయితే తప్ప ఇళ్ల నుంచి బయటకు రావొద్దని కోరారు. విద్యుత్ తీగలు తెగిపడినా, కిందకు జారిన వెంటనే సమీప అధికారులకు సమాచారం అందించాలని, తాకడం, పక్కకు నెట్టడం లాంటి పనులు చేయవద్దని సూచించారు.
ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదులపైనా అధికారులు తక్షణమే స్పందించి సమస్య పరిష్కారానికి చొరవ చూపాలని, అలసత్యం వహిస్తే చర్యలు తప్పవన్నారు. భారీ వర్షాలు, తుఫానుల సమయంలో విద్యుత్ శాఖ అధికారులపైనే ఉన్నత బాధ్యత ఉంటుందని, దానికి అనుగుణంగా పని చేయాలని అన్నారు. కంట్రోల్ రూమ్, కార్పొరేట్ ఆఫీస్ 9440816373, శ్రీకాకుళం 9490612633, పలాస 7382585630, పలాస 7095875259, విజయనగరం 9490610102, విశాఖపట్నం 7382299975, రాజమహేంద్రవరం 7382299960, ఏలూరు 9440902926. ప్రజలకు విద్యుత్‌కు సంబంధించి ఏవైనా సమస్యలు ఉంటే ఈ నంబర్లను సంప్రదించాలని సూచించారు.