అల్పపీడన ప్రభావంతో కురిసిన వర్షానికి ఒంగోలు నగరంలో సుమారు రూ.2.45 కోట్లు నష్టం వాటిల్టినట్లు అధికారులు ప్రాథమిక అంచనాకు వచ్చారు. గత మూడు రోజులుగా నగరంలో ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షంతో నగరం తడిసి ముద్దయింది. ఈవర్షానికి నగరంలో సుమారు 2.1 కి.మీ రోడ్లు దెబ్బతినగా, 0.7 కి.మీ డ్రయినేజీలు దెబ్బతిన్నాయి. చెట్లు విరిగిపడటంతో సుమారు 490 వీధి లైట్లు మరమ్మతులకు గురైనట్లు కార్పొరేషన్ అధికారులు అంచనాకు వచ్చారు. నగరంలో 315 కి.మీ సీసీ రోడ్లు, 197.70 కి.మీ బీటీ రోడ్లు, 7.80 కి.మీ డబ్ల్యూఎం. రోడ్లు, 63.50 కి.మీ. కచ్చా రోడ్లు ఉన్నాయి. దాంతోపాటు పక్కా డ్రెయిన్‌లు 348 కి.మీ, కచ్చా డ్రెయిన్‌లు175 కి.మీ, స్ర్టోమ్ వాటర్ డ్రయినేజీలు 23.50 కి.మీ విస్తరించి ఉన్నాయి. పాడైన రోడ్లకు రూ.153 లక్షలు, దెబ్బతిన్న డ్రయినేజీల మరమ్మతుల కోసం రూ.80 లక్షలు, సుమారు 490 వీధి దీపాల మరమ్మతులకు రూ.12.5 లక్షలు అవసరం ఉన్నట్లు అధికారులు గుర్తించారు.