ఆంధ్రప్రదేశ్లో మూడు రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. వానలు కుండపోతగా పడుతుండటంతో ఏపీలోని రోడ్లు కొట్టుకుపోయాయి. దీంతో రహదారుల మరమ్మతుల కోసం ఆర్ అండ్ బీ శాఖతో మంత్రి జనార్దన్ రెడ్డి ఈరోజు(సోమవారం) ఉన్నతస్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు. .వరద ప్రభావిత జిల్లాల ఎస్.ఈ, ఈఈ లతో వీడియో కాన్ఫరెన్స్లో మంత్రి. మాట్లాడారు. ఈ సందర్భంగా మరమ్మతులపై అధికారులకు మంత్రి జనార్దన్ రెడ్డి కీలక ఆదేశాలు జారీ చేశారు.వరద పరిస్థితులు, రోడ్లు, భవనాల స్థితిగతులపై ఆరా తీశారు. ఇప్పటికే 2వేల కిలోమీటర్ల రహదారులు దెబ్బతిన్నాయని మంత్రికి అధికారులు వివరించారు. ప్రజల రాకపోకలకు ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలని మంత్రి ఆదేశించారు. వంతెనల వద్ద ప్రమాద హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేసి ప్రమాదాలను నివారించాలని మంత్రి జనార్దన్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. వరద పరిస్థితులు సద్దుమణిగే వరకు ఆర్ అండ్ బీ శాఖలో సెలవులు రద్దు చేసినట్లు మంత్రి ప్రకటించారు. ప్రజలకు ఎప్పటికప్పుడు అందుబాటులో ఉండి సమస్యలు పరిష్కరించాలని మంత్రి జనార్ధన్ రెడ్డి తెలిపారు.