ఇటీవల కురిసిన భారీ వర్షాలకు తెలుగు రాష్ట్రాలు ఎంతలా తల్లిడిల్లిపోయాయో తెలిసిందే. ఏపీలో విజయవాడ, పరిసర ప్రాంతాలు, తెలంగాణలోని ఖమ్మం పట్టణ పరిసర ప్రాంతాలను వరదలు ముంచెత్తాయి. ముఖ్యంగా ఏపీలో లక్షలాది మంది నిరాశ్రయులుగా మారారు. ఈ నేపథ్యంలో సీఎం సహాయ నిధికి విరాళాలు అందించాలని ఇటు ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు.. అటు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. ఈ పిలుపునకు హిందూపురం ఎమ్మెల్యే, సినీనటుడు నందమూరి బాలకృష్ణ స్పందించారు. తెలుగు రాష్ట్రాల సీఎంల సహాయనిధికి కోటి రూపాయల విరాళాన్ని బాలయ్య ప్రకటించారు. బాధాతప్త హృదయంతో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి సహాయ నిధికి రూ.50 లక్షలు, తెలంగాణ ముఖ్యమంత్రి సహాయ నిధికి రూ.50 లక్షలు తనవంతు బాధ్యతగా బాధిత ప్రజల సహాయార్థం విరాళంగా అందిస్తున్నానని ఆయన తెలిపారు. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా ఆయన ప్రకటన చేశారు.