ఆంధ్రప్రదేశ్‌లో నాలుగు రోజులుగా భారీ వర్షాలు పడుతున్నాయి. వానలు ఏకధాటిగా కురుస్తుండటంతో విజయవాడలోని బుడమేరు పొంగి ప్రహహిస్తోంది. దీంతో పలు కాలనీలు జలమయం అవడంతో ప్రజలు నరకయాతన పడుతున్నారు. ప్రజలను రక్షించడానికి ఏపీ ప్రభుత్వం రంగంలోకి దిగి సహాయక చర్యలను ముమ్మరం చేసింది. అయితే, వరద ప్రభావిత ప్రాంతాల్లో నీరు తగ్గిన తర్వాత చేపట్టాల్సిన చర్యలపై రాష్ట్ర ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. నగరంలో పారిశుధ్య నిర్వహణ కోసం ఇతర మున్సిపాలిటీల నుంచి అధికారులను మంత్రి నారాయణ రప్పించారు. ఇతర మున్సిపాలిటీల నుంచి వచ్చిన 63 మందిని పారిశుధ్య నిర్వహణ కోసం ప్రత్యేకాధికారులు నియమించారు. ఇతర మున్సిపాలిటీల నుంచి సుమారు 4 వేల మంది పారిశుధ్య కార్మికులను బెజవాడకు ప్రభుత్వం రప్పిస్తుంది. నగరపాలక సంస్థ ప్రధాన కార్యాలయంలో మున్సిపల్ శాఖ ఉన్నతాధికారులు, ప్రత్యేకాధికారులతో మంత్రి పొంగూరు నారాయణ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి మున్సిపల్ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అనిల్ కుమార్ సింఘాల్, స్వచ్ఛా కార్పొరేషన్ ఎండీ గంధం చంద్రుడు, మున్సిపల్ శాఖ డైరెక్టర్ హరి నారాయణన్, టిడ్కో ఎండీ సాయి కాంత్ వర్మ, వీఎంసీ కమిషనర్ ధ్యాన చంద్ర, టౌన్ ప్లానింగ్,ఇంజినీరింగ్ విభాగాల ఉన్నతాధికారులు హాజరయ్యారు.