పారాలింపిక్స్‌లో భారత్ 20 పతకాలు సాధించి రికార్డు సృష్టించిన సంగతి తెలిసిందే. గత టోక్యో పారాలింపిక్స్‌లో 19 పతకాలను సాధించిన భారత అథ్లెట్లు..ఇప్పుడా సంఖ్యను దాటేశారు. ఇంకా పతకాంశాలు మిగిలే ఉన్నాయి. దీంతో టీమ్‌ఇండియా మెడల్స్ మరిన్ని పెరిగే అవకాశం లేకపోలేదు. ఈ నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ అథ్లెట్లతో ప్రత్యేకంగా సంభాషించారు. పతకాలు గెలిచిన అథ్లెట్లకు అభినందనలు తెలిపారు. బరిలో నిలిచిన వారికి శుభాకాంక్షలు తెలిపారు. ప్రధాని మోదీ బ్రూనై నుంచి సింగపూర్ పర్యటనకు మోదీ బయల్దేరారు. బ్రూనైలో అధికారిక సమావేశాలు ముగిసిన అనంతరం అథ్లెట్లతో మోదీ ప్రత్యేకంగా సంభాషించారు. పతకాలు సాధించిన దీప్తి జీవాంజి, మరియప్పన్ తంగవేలు, శరద్ కుమార్, సుందర్ సింగ్ గుర్జార్, అజీత్ సింగ్ తదితరులను అభినందిస్తూ మోదీ ఇప్పటికే సోషల్ మీడియాలో పోస్టు చేశారు.
పారాలింపిక్స్ ప్రారంభానికి ముందు భారత్ 25 పతకాలను లక్ష్యం చేసుకొని బరిలోకి దిగింది. మొత్తం 84 మందితో కూడిన అథ్లెట్ల బృందం పారిస్‌కు చేరుకుంది. టోక్యో రికార్డును అధిగమించిన భారత్.. 'పాతిక' టార్గెట్‌ను కొట్టడం కష్టమేం కాదు. కేంద్రం నుంచి పారా అథ్లెట్లకు పూర్తిస్థాయిలో సహకారం లభించడం వల్లే ఇదంతా సాధ్యమైంది. అత్యున్నత స్థాయిలో శిక్షణ, పరికరాలు, విదేశీ నిపుణుల సూచనలు అందేలా చేయడం, సాయ్ క్రీడా కేంద్రాల్లో సాధన కీలక పాత్ర పోషించాయి. క్రీడాకారులను సమాయత్తం చేసేందుకు అంతర్జాతీయ స్థాయిలో 110కిపైగా పోటీలకు పంపించింది. పారాలింపిక్స్‌లో పతకాల వేటకు బరిలోకి దిగిన అథ్లెట్ల కోసం రూ.22 కోట్లు కేటాయించగా.. క్వాలిఫైడ్ అంశాల కోసం రూ. 74 కోట్ల వరకు ఖర్చు చేసినట్లు తెలుస్తోంది.