విజయవాడ నగరం వర్షం కురుస్తోందంటేనే చిగురుటాకులా వణికి పోతోంది. గత నాలుగు రోజులుగా విజయవాడలోని ప్రజానీకం ఇంకా వరద నీటిలోనే కాలం గడుపుతోంది. ఇప్పుడిప్పుడు పరిస్థితులు కాస్త కుదురుకుంటున్నా కూడా ఇంకా తెలియని ఆందోళన జనాల్లో వ్యక్తమవుతోంది. విజయవాడ నగరం ఎన్నడూ లేనంత సంక్షోభానికి గురైంది. చివరకు సీఎంతో సహా మంత్రులు, అధికార యంత్రాంగమంతా నిద్రాహారాలు మాని పరిస్థితులు అదుపులోకి వచ్చే వరకూ శ్రమించాయి. ప్రజలకు ఆహారం, నీళ్లు, పాలు అందిస్తూ వారు కూడా వరద నీటిలోనే కాలం వెళ్లదీశారు. కాగా.. నగరంలో వరద తగ్గిన ప్రాంతాల్లో జరుగుతున్న పారిశుధ్య పనులను మంత్రులు పొంగూరు నారాయణ, సవిత పరిశీలించారు. 54 వ డివిజన్‌లో చెత్త తొలగింపు,ఫైర్ ఇంజన్‌లతో క్లీనింగ్ చేస్తున్న ప్రాంతాలను మంత్రులు పరిశీలించారు. వరద బాధితుల ఇళ్లకు వెళ్లి వారి సమస్యలను మంత్రులు అడిగి తెలుసుకున్నారు. వించిపేటలో ఫైర్ ఇంజిన్ ద్వారా పాఠశాలను కొంతమేర మంత్రి నారాయణ శుభ్రం చేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. విజయవాడలో గతంలో ఎప్పుడూ లేనంత వరదతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారన్నారు. వరద ప్రాంతాల్లో మొదటి రోజు ప్రజలను రక్షించేందుకు వెళ్లిన బోట్లు, ట్రాక్టర్లు కూడా బోల్తా పడ్డాయన్నారు. వరద బాధితులందరికీ సరిపడా ఆహారం, తాగునీరు, పాలు, బిస్కట్లు, పండ్లు అందించేలా సీఎం చంద్రబాబు అన్ని చర్యలు తీసుకున్నారని తెలిపారు. ఇప్పటి వరకూ 80 శాతం వరద తగ్గిందని పేర్కొన్నారు. వరద బాధితులకు రేపటి నుంచి నిత్యావసర సరుకులు పంపిణీ చేయాలని సీఎం చంద్రబాబు ఆదేశించారని మంత్రి నారాయణ తెలిపారు. పారిశుధ్యం పనులు శరవేగంగా జరుగుతున్నాయని వెల్లడించారు. మొత్తం 10 వేల మంది పారిశుధ్య కార్మికులు చెత్త తొలగింపు, బ్లీచింగ్ చల్లే పనుల్లో నిమగ్నమై ఉన్నారని వెల్లడించారు. అత్యాధునిక యంత్రాలు ఉపయోగించి చెత్తను త్వరితగతిన తొలగించేలా ఏర్పాట్లు చేశామని తెలిపారు. నిన్న ఒక్కరోజే బాధితులకు 26 లక్షల వాటర్ బాటిల్స్,10 లక్షల బిస్కట్ ప్యాకెట్లు, 8 లక్షల పాల ప్యాకెట్లు సరఫరా చేశామని మంత్రి పొంగూరు నారాయణ వెల్లడించారు.