వర్షాలు ఏపీని వీడటం లేదు. భారీ వర్షాలకు బుడమేరు మహోగ్రరూపం దాల్చడంతో బెజవాడ ముంపునకు గురైంది. ఇప్పుడిప్పుడే వరద భారీ నుంచి విజయవాడ వాసులు కాస్త కోలుకుంటున్న పరిస్థితి. మరోవైపు మైలవరం నియోజకవర్గంలో గత రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తోంది. దీంతో డ్రైన్‌లు పొంగి వర్షపు నీరు రోడ్లపై ప్రవహిస్తున్నాయి. వర్షపు నీరుతో లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. లోతట్టు ప్రాంతాల్లో అధికారులు ఎలాంటి ముందస్తు చర్యలు చేపట్టకపోవడంతో ఇళ్లలోకి వర్షపు నీరు చేరి ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కుంటున్నారు. ఎగువ ప్రాంతం నుంచి వస్తున్న వరదతో బుడమేరు ఉధృతంగా ప్రవహిస్తోంది. చండ్రగూడెం మల్లయ్య కుంటకు గండి పడింది. కొండ వాగు ప్రవాహంతో పొందుగల చౌడు చెరువు కింద వరి పొలాలు నీట మునిగాయి. వెల్వడం వద్ద ప్రమాదకర స్థాయిలో బుడమేరు ప్రవహిస్తోంది.